హైడ్రా స్మూత్ వార్నింగ్
హైదరాబాద్, ఫిబ్రవరి 18, (వాయిస్ టుడే)
Hydra Smooth Warning
మోసగాళ్లు టెక్నాలజీని బాగా వినియోగించుకుంటున్నారు. ప్రజల ఆశలను సొమ్ము చేసుకుంటున్నారు. వీటి బారినపడిన వాళ్లు చాలామంది కష్టాలు తెచ్చుకుంటున్నారు. లెటెస్ట్‌గా హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ ప్రజలను సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బందులకు గురి కావొద్దన్నది అందులోని కీలకమైన పాయింట్. ఇంతకీ అసలేం జరిగింది?ఈ మధ్యకాలం న్యూస్ పేపర్లు, టీవీలు, ఎఫ్ఎం రేడియోల్లో ఓ తరహా వార్తలు హంగామా చేస్తున్నాయి. పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన మార్గం. ఫలానా ఏరియాలో ఫామ్ ల్యాండ్ కావాలా? తక్కువ ధరకే విక్రయం చేస్తున్నాం. పెట్టుబడికి మీకు ఇదే సరైన సమయం, ఏమాత్రం ఆలస్య చేయవచ్చు. దాని మీద వచ్చే ఆదాయం మీకేనంటూ ఒకటే ప్రకటనలు.ప్రజల వీక్ నెస్‌ని కొందరు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఖాళీ ల్యాండ్ కొంటే ఏమొస్తుందని భావించిన కొందరు సామాన్యులు.. ఫామ్ ల్యాండ్ కొనుగోలు చేస్తే, దాని మీద ఆదాయం వస్తుందని ఆశపడుతున్నారు.. బుట్టలో పడుతున్నారు. ఇవన్నీ గమనించిన హైడ్రా చీఫ్ అనధికార భూములు, ఫ్లాట్లు కొనుగోలు చేసేవారికి చిన్నపాటి హెచ్చరిక చేశారు.అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బందులకు గురికావొద్దని హైడ్రా కమిషన్ ఏవీ రంగనాథ్ ప్రజలకు సూచన చేశారు. ఫార్మ్ ల్యాండ్ పేరుతో జరుగుతున్న క్రయ విక్రయాల ప్లాట్లకు అధికారిక అనుమతులుండవన్నారు. వాటిలో నిర్మాణాలను చేపట్టడానికి అనుమతులు ఇవ్వరని తేల్చేశారు.ప్లాట్లు కొనుగోలు చేస్తే తర్వాత ఇబ్బందులు తప్పవనే విషయాన్ని గుర్తు చేశారాయన. తెలంగాణ మున్సిపల్ యాక్ట్-2019, పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం వ్యవసాయ భూముల్లో ప్లాట్లు అమ్మవద్దని స్పష్టమైన నిబంధనలున్నాయని తెలిపారుప్రభుత్వానికి ఫీజులు ఎగవేయడానికి, ప్రజలను మోసం చేసేందుకు కొందరు వ్యక్తులు చేస్తున్న మోసాలను బయటపెట్టారు. ఫామ్ ల్యాండ్ కొనుగోలుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సోమవారం హైదరాబాద్ హైడ్రా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. అందులో ఫార్మ్ ల్యాండ్స్ సంబంధించిన విక్రయాలపై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. ఈ క్రమంలో ప్రజల్ని హెచ్చరించారు కమిషనర్.రాజేంద్రనగర్ మండలం లక్ష్మిగూడలోని 50వ సర్వే నెంబరులో ఎకరం రెండు గుంటల భూమిని ఫామ్‌ల్యాండ్ పేరుతో ప్లాట్లుగా అమ్ముతున్నట్లు హైడ్రాను ఆశ్రయించారు స్థానికులు. వీటి గురించి కమిషనర్ రంగనాథ్ ఆరా తీశారు. అనుమతి తీసుకుని లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తే సర్కారుకు ఫీజు కట్టాలని, దాని నుంచి తప్పించుకునేందుకు కొందరు వ్యాపారులు వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారని వివరించారు.అలా అమ్మాలంటే కనీసం అర ఎకరా భూమిని విక్రయించాలన్నారు. అప్పుడే రిజిస్ట్రేషన్ కు ఆ భూములు పని కొస్తాయని, దీనిపై 2018లో ప్రభుత్వం ఆదేశాలిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా కొందరు అధికారులు అవేమీ పట్టించుకోవట్లేదన్నారు. అలాంటి వ్యక్తులు, సంస్థలపై చర్యలు తప్పవన్నారు. జీవో నంబరు 131 ప్రకారం 31.8.2020 తర్వాత అనధికారిక లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం లేదన్నారు. అనుమతి లేకుండా కడితే కూల్చేస్తామని చెప్పకనే చెప్పేశారు కమిషనర్.