నేను కాంగ్రెసోణ్ని కాదు!
అదో పార్టీనా..?
నేను పక్కా బీఆర్‌ఎస్!!
I am not a Congressman!* Is that a party..?
పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
డంప్‌యార్డ్ సమస్యపై తనను కలిసిన గ్రామస్థులపై ఎమ్మెల్యే మండిపాటు
ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ నా వ్యాఖ్యలను వక్రీకరించారు:
ఎమ్మెల్యే పటాన్‌చెరు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ టికెట్‌పై పటాన్‌చెరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. కాంగ్రెస్ కండువా కప్పుకొన్న సంగతి తెలిసిందే. ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే ఎమ్మెల్యే.. తాజాగా కాంగ్రెస్ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుమ్మడిదల మండలం ప్యారానగర్ జేఏసీ నాయకులు, గ్రామస్థులు తమ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న జీహెచ్‌ఎంసీ డంప్‌యార్డ్‌ను ఎత్తివేయాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి విజ్ఞప్తి చేసేందుకు ఇటీవల ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు, ఎమ్మెల్యేకు మధ్య వాదన జరిగింది. ‘మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారు కదా. ప్యారానగర్ డంప్‌యార్డ్‌ను ఎత్తివేయించండి’ అని కొందరు అడగడంతో మహిపాల్‌రెడ్డి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ‘నేను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడిని కాదు. అదో పార్టీనా? నేను పక్కా బీఆర్‌ఎస్’ అంటూ అభ్యంతకమైన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్యారానగర్ డంప్‌యార్డ్ ఉద్యమం జరుగుతున్నా తనకు మాట మాత్రం చెప్పకుండా కొందరు నాయకులతో కలిసి రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేగా తన వద్దకు రాకుండా ఏం చేస్తున్నారని గ్రామస్థులను నిలదీశారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి విషయంలో తాను పార్టీలను చూడనని వ్యాఖ్యానించారు. డంప్‌యార్డ్ విషయం చేయి దాటిపోయిందని, ప్రభుత్వ నిర్ణయం మారదని స్పష్టం చేశారు. కాగా, ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన కాంగ్రె్‌సలో చేరడాన్ని ముందు నుంచి జీర్ణించుకోలేని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కాట శ్రీనివా్‌సగౌడ్ వర్గీయులు శుక్రవారం బీరంగూడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు పార్టీలో చేరిన వ్యక్తితో ఎప్పటికైనా నష్టమేనన్నారు. కాంగ్రెస్ పార్టీని బహిరంగంగా అనరాని మాటలు అంటున్నా ఇంకా కొనసాగించడమంటే పార్టీ కార్యకర్తలు, నాయకుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. తన వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ప్రకటన విడుదల చేశారు. తాను కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ప్యారానగర్ డంప్‌యార్డ్ తొలగించే అంశంపై పార్టీలకతీతంగా చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పే సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు.