–
నల్గోండ, ఫిబ్రవరి 13
తన ప్రాణం పోయినా తెలంగాణకు అన్యాయం జరగనివ్వబోనని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు. నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్ ప్రాంతం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని కేసీఆర్ ప్రసంగించారు. కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ బయటికి వచ్చి ప్రజల మధ్యకు రావడం ఇదే మొదటిసారి.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘క్రిష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా కొట్లాడతాం. నేను పిలుపిస్తేనే భయపడి సభలో తీర్మానం పెట్టారు. దాంతో చాలదు. అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రానికి తీసుకుపోండి. కావాలంటే ఐదేళ్లు అధికారంలో ఉండండి. మాకేం ఇబ్బంది లేదు. ఉమ్మడి రాష్ట్రమే బాగుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇచ్చేలా ఢిల్లీలో సంతకం పెట్టి వచ్చారు. నాలుగైదురోజులు కాంగ్రెస్ మంత్రులు నాటకాలాడారు. అసెంబ్లీలో కూడా బడ్జెట్ పక్కకు పెట్టి ప్రాజెక్టులపై చర్చ పెట్టారు. సాగునీటిపారుదల మంత్రిగా పని చేసినందునే మొన్న హరీశ్ రావు గట్టిగా సమాధానం ఇచ్చారు. ప్రజల్లోనే తేల్చుకుందామని నల్గొండ సభకు పిలుపు ఇచ్చా. నేను పిలుపు ఇవ్వగానే సభలో హడావుడిగా తీర్మానం పెట్టారు. అది కూడా సరిగ్గా పెట్టలేదు. దాంట్లో విద్యుత్ సంగతి లేనేలేదు. కాంగ్రెస్ వాళ్లు తెలివి తక్కువ తీర్మానం పెట్టారు.
కొత్త ప్రభుత్వం ఒక్కటైనా మంచి పని చేస్తుందా? గట్టిగా మాట్లాడితే మీరు పెద్దోళ్లు అయిపోతరా? ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. తెలంగాణ ప్రజల హక్కులు, వాటాలు శాశ్వతం. కేసీఆర్ సర్కారు పోగానే స్విచ్ తీసేసినట్లు కరెంటు పోతోంది. అసెంబ్లీలోనే జనరేటర్లు తెచ్చి పెడుతున్నరు.. అలాంటిది ఏప్రిల్, మే నెలల్లో 24 గంటల కరెంటు ఇస్తరా? నేను తొమ్మిదిన్నరేళ్లు 24 గంటల కరెంటు ఇచ్చా. ఇప్పుడు కరెంటు ఏమైపోయింది? చేతగాని వాళ్ల రాజ్యం ఇలాగే ఉంటుంది. కరెంటు కోసం అందరూ ఎక్కడికక్కడ నిలదీయండి. మేం ఈ ఛలో నల్గొండతోనే ఆపం.. ఇలాంటి పోరాటం సాగుతూనే ఉంటుంది. మేం ఇచ్చినట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 24 గంటల కరెంటు ఇవ్వాలి.మీకు దణ్నం పెట్టి చెప్తున్నా.. నేను మీ బిడ్డను, చావు నోట్లో తలకాయ పెట్టి చావు వరకూ పోయి తెలంగాణ తెచ్చింది నేను. అందుకే రాష్ట్రం బాగు కోసం నాకు తన్నులాట ఉంటది. అప్పట్లో రైతు బంధు పడ్డట్లు మీ ఫోన్లు టింగ్ టింగ్ అని మోగేవి. ఇప్పుడు అసెంబ్లీలో వారి వాగుడే వినబడుతోంది. మీరేం ఫికర్ కావొద్దు.. మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తది. ఇయ్యల కొత్త దుకాణం మొదలుపెట్టిన్రు. పంటకు కనీస మద్దతు ధర వస్తే వాళ్లు చెప్పిన బోనస్ రూ.500 ఇవ్వరట. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మద్దతు ధర ఇవ్వలేదా? ధాన్యం కొనలేదా? మీ అబద్ధపు మాటలతో జనాన్ని మోసం చేస్తే నడవదు బిడ్డా’’ అని కేసీఆర్ మాట్లాడారు.
ప్రాణం పోయినా అన్యాయం జరగనివ్వను – కేసీఆర్
- Advertisement -
- Advertisement -