హైదరాబాద్, సెప్టెంబర్ 29: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కి శుక్రవారం అంకురార్పరణ జరుగుతోంది! నేటి నుంచే వార్మప్ మ్యాచులు మొదలవుతున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల జట్లు భారత్‌కు వచ్చేశాయి. తమకు కేటాయించిన స్టేడియాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడుతున్నాయి. ప్రధాన జట్లు ట్రోఫీ గెలిచేందుకు చాన్నాళ్ల క్రితమే వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. అందుకు తగ్గ ఆటగాళ్లను ఎంపిక చేశాయి.ఈ మెగా టోర్నీలో మొత్తం 10 సన్నాహక మ్యాచులు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచులు మొదలవుతాయి. అరగంట ముందే టాస్ వేస్తారు. రాత్రి 10 గంటలకు మ్యాచ్‌లు ముగుస్తాయి. శుక్రవారం మూడు సన్నాహక పోటీలు ఉన్నాయి. శని, ఆదివారాల్లో రెండు చొప్పున, సోమవారం మూడు మ్యాచులు జరుగుతాయి. పోటీలన్నీ స్టార్‌స్పోర్ట్స్ ఛానళ్లు, డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారం అవుతున్నాయి. మొబైల్ వరకు హాట్‌స్టార్‌లో ఉచితంగా వీక్షించొచ్చు. గువాహటిలో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు మొదటి సన్నాహక మ్యాచ్ ఆడనున్నాయి. అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా తిరువనంతపురంలో తలపడతాయి. కీలకమైన న్యూజిలాండ్, పాకిస్థాన్ వార్మప్ మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతోంది.

టీమ్‌ఇండియా తొలి సన్నాహక మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో తలపడనుంది. శనివారం గువాహటిలో ఈ పోరు ఉంటుంది. ఇక తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో ఆస్ట్రేలియా పోటీపడుతుంది. భారత్ రెండో సన్నాహక మ్యాచును మంగళవారం తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో ఆడుతుంది. పాక్, న్యూజిలాండ్ మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేకపోలేదు. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చు. గురువారం సైతం నగర వ్యాప్తంగా వరుణుడు వాన కురిపించాడు. శుక్రవారం సైతం ఉదయం మబ్బులు కమ్మాయి. సాయంత్రం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. జల్లులు కురిస్తే ఈ మ్యాచుకు ఒకట్రెండు సార్లు అంతరాయం కలగొచ్చు.
న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్డ్, మార్క్ చాప్‌మన్, డేవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాథ్యూ హెన్రీ, టామ్ లేథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్
పాక్ జట్టు జాబితా: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హ్యారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, ఇమాముల్ హక్, మహ్మద్ వసీమ్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్ షకీల్, షాహిన్ షా ఆఫ్రిది, ఉసామా మీర్ రిజర్వ్ ఆటగాళ్లుగా మహ్మద్ హారిస్, అబ్రార్ అహ్మద్, జమాన్ ఖాన్ .
విశాఖ ఇండస్ట్రీస్ కు బాకీలు చెల్లించండి….
మరో వైపు భద్రతా కారణాలతో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడం లేదు. అయితే ఈ నిబంధన ఇదొక్క మ్యాచ్‌కే పరిమితం. తర్వాతి మ్యాచ్‌లు యథావిధిగా అభిమానుల సమక్షంలోనే జరగనున్నాయి. హైదరాబాద్ వేదికగా రెండు వార్మప్ మ్యాచ్‌లు.. మూడు ప్రధాన మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ఓ వాణిజ్య వివాదం విషయంలో హెచ్‌సీఏకు చెందిన అన్ని ఆస్తులు, బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాలని సెప్టెంబర్ 22న రంగారెడ్డి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై హైదరాబాద్ క్రికెట్ సంఘం హైకోర్టును ఆశ్రయించింది. తమ వాదనలు వినకుండానే ట్రయల్ కోర్టు ఆస్తుల జప్తు ఆదేశాలు జారీ చేసిందని హెచ్‌సీఏ అడ్మినిస్ర్టేటర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విశాఖ ఇండస్ట్రీస్‌కు రూ.40 కోట్లు చెల్లించాలంటూ ఆర్బిట్రేషన్ అవార్డు జారీ అయిందని ఇందులో వివరించారు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు. దీనిపై తాము కోర్టును ఆశ్రయించామని అది విచారణలో ఉండగానే ఆర్బిట్రేషన్ అవార్డు అమలు కోసం విశాఖ ఇండస్ట్రీస్ ట్రయల్ కోర్టుకు వెళ్లిందని ఆయన తెలిపారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి విశాఖ ఇండస్ట్రీస్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య 2004లో ఒక ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి ఇద్దరి మధ్య వివాదం తలెత్తడంతో విశాఖ ఇండస్ట్రీస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలోనే హెచ్‌సీఏకు చెందిన అన్ని ఆస్తులు, బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాలని సెప్టెంబర్ 22న రంగారెడ్డి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ విషయంపైనే హైకోర్టును ఆశ్రయించింది హెచ్‌సీఏ.దిగువ కోర్టు అటాచ్ చేసిన స్టేడియం, బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది హెచ్‌సీఏ. ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌కు ముందు హెచ్‌సీఏపై ఒత్తిడి తెచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఈ పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారిస్తామని చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదే ధర్మాసనం తెలిపింది. కాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా రెండు వామప్ మ్యాచ్‌లు.. మూడు ప్రధాన మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 29న పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్‌తో పాటు అక్టోబర్ 3న పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ ఇక్కడే జరగనుంది. ఇక ప్రధాన మ్యాచ్‌ల విషయానికొస్తే.. అక్టోబర్ 6న పాకిస్థాన్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుంది. అలాగే అక్టోబర్ 9న న్యూజిలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్, అక్టోబర్ 10న పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌లు కూడా ఇదే మైదానంలోనే జరగనున్నాయి



