- Advertisement -
విగ్రహ మార్పు…
Idol change...
ఎవరికి మైలేజ్… ఎవరికి డ్యామేజ్
హైదరాబాద్, డిసెంబర్ 10, (వాయిస్ టుడే)
విగ్రహాలు స్ఫూర్తిదాయకాలు.. చరిత్రపుటలపై చేసిన చెరుగని సంతకాలు.. భావజాలానికి ప్రతీకలు.. భావోద్వేగాలకు వేదికలు. అయితే ఈ భావజాల జాతరలో తెలంగాణ తల్లి విగ్రహ రూపం రాజకీయ రగడను రాజేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరిక పోకడలు ఉన్నాయని కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ తల్లికి కొత్త రూపం ఇచ్చింది. దీంతో విగ్రహం చుట్టూ వివాదం మొదలైంది.దేవత వేరు, తల్లి వేరు అంటూ కాంగ్రెసె సర్కార్ బలంగా వినిపిస్తోంది. తల్లి ప్రతిరూపంగా ఉండాలనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సాదాసీద రూపం ఇచ్చామని సీఎం అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. తల్లి వజ్ర వైడుర్యాలతో భుజకీర్తులు, కిరీటాలతో ఉండాలా అని సీఎం ప్రశ్నించారు. ఒక వ్యక్తి, ఒక పార్టీ ఆలోచనే తెలంగాణ ఆలోచనగా కొందరు చెప్తున్నారని అన్నారు.ఈ విగ్రహ రూపంపై బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. విగ్రహంలో బతుకమ్మను విస్మరించి.. తెలంగాణ సంస్కృతినే అవమానించారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. పైగా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తును ప్రతిబింబించేలా విగ్రహాన్ని రూపొందించారు తప్పా.. తెలంగాణ తల్లి విగ్రహం కానే కాదని అంటున్నాయి. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ తల్లి విగ్రహమే అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.మన దేశంలో విగ్రహ రాజకీయాలు కొత్తేమి కాదు. కుల, మత, ప్రాంతీయ, సాంఘీక , రాజకీయ థృక్పదానికి ఎన్నో విగ్రహాలు ప్రతీకలుగా నిలిచాయి. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం విగ్రహాలను వాడుకున్న సందర్భాలు కోకొల్లలు. విగ్రహ ఏర్పాటు నుంచి విధ్వంసాల వరకు ఎన్నో ఘటనలు సాక్ష్యాలుగా నిలిచాయి.మొదట స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు వారి త్యాగాలకు గుర్తుగా ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత రాజకీయ నేతల విగ్రహాలు రోడ్లపై కొలువుతీరాయి. ఇలా దేశంలో పెద్ద ఎత్తున విగ్రహ రాజకీయాలు మొదలయ్యాయి. ఈ విగ్రహాల ద్వారా తమ పార్టీ భావజాలాన్ని తీసుకువెళ్లడమే ప్రధాన ఉద్దేశం. చివరకు ఇవన్నీ ఓట్ బ్యాంకు రాజకీయాల కోసమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగు తల్లికి పోటీగా ఉద్యమకారులు తెలంగాణ తల్లి భావన తీసుకువచ్చారు. కేసీఆర్ సహా ఉద్యమ నేతలు తెలంగాణ తల్లి విగ్రహ భావజాలాన్ని తెలుగు తల్లికి పోటీగా తీసుకువచ్చి తెలంగాణ వ్యాప్తంగా ఈ విగ్రహాల ప్రతిష్టాపన చేశారు. ప్రతీ ఉద్యమ కార్యక్రమానికి ముందు తెలంగాణ తల్లికి అంజలి ఘటించడం, జయ జయహే తెలంగాణ పాట ఆలపించడం ఉద్యమంలో భాగమైంది. ఇలా తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది.పదేళ్ల పాలన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహంలోను, ప్రభుత్వ అధికారిక చిహ్నంలో మార్పులు తేవాలని నిర్ణయించారు. అందులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహంలో కొన్ని మార్పులు చేశారు. దీన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉద్యమంలో ప్రాచుర్యం పొందిన తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా చేయి గుర్తుతో ఉన్న విగ్రహంగా మార్చారంటూ విమర్శలు చేస్తోంది. అయితే తిరిగి తాము అధికారంలోకి వస్తే మళ్లీ పాత తల్లి విగ్రహాన్నే ప్రతిష్టిస్తామని చెబుతోంది.మొత్తంగా తెలంగాణలో విగ్రహ రాజకీయం ముదిరి రెండు పార్టీల మధ్య మరింత చిచ్చు రాజేస్తోంది. మరి ఈ విగ్రహ వివాదంతో ఏ పార్టీకి ఎంత లబ్ధి చేకూరుతుందన్నదానికి భవిష్యత్తే సమాధానం చెప్పాలి.
- Advertisement -