కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తామని ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు మాట్లాడుతున్నారని కేటీఆర్ తెలిపారు.
రాజ్యాంగాన్ని మార్చేస్తే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు మాయమయ్యే పరిస్థితి ఉందన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ దేశానికి ప్రమాదం బీజేపీతోనే అని కేటీఆర్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఎంపీ, కర్ణాటకకు చెందిన మరో ఎంపీ, మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ అభ్యర్థి బహిరంగంగా చెబుతున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీ వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తాం.. రిజర్వేషన్లు ఎత్తేస్తాం. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు అన్నింటిని తీసిపారేస్తాం అంటున్నారు. కాబట్టి కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మాయమయ్యే పరిస్థితి ఉంది. నేనేదో అక్కసుతో, కోపంతో చెప్పట్లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కార్యక్రమం స్టార్ట్ చేశారు. డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, ఫిట్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా.. ఇవన్నీ ఏమయ్యాయో ఎవరికీ తెలియవు. కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. గత ఎన్నికల ముందు ఆదిలాబాద్‌లోని సీసీఐ తిరిగి తెరుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటిచ్చారు. కానీ ఆ పని కాలేదు. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఒక లాభం ఉంటంది ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల వారీగా ఉద్యోగాలు వస్తాయి. అదానీకో, అంబానికో అమ్మేస్తే రిజర్వేషన్లు ఉండవు. కేంద్రంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేసింది బీజేపీ ప్రభుత్వం. అదే మార్గంలో రాజ్యాంగాన్ని మార్చేసి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు లేకుండా చేయాలన్నదే బీజేపీ పంతం. కాబట్టి దళిత, గిరిజన సోదరులు బీజేపీ ఎత్తుగడలను గ్రహించి ఓటేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.