- మాట పొదుపుగా లేకుంటే.. విపక్షాలకు టార్గెట్‌గా!
- రేవంత్ రెడ్డి ‘ఉచిత విద్యుత్’ వ్యాఖ్యలతో రాజుకున్న సెగ
- అవకాశం అందుకున్న అధికార పార్టీ
- సొంత పార్టీ కాంగ్రెస్‌లోనూ భిన్న స్వరాలు
హైదరాబాద్: ‘రాజకీయాల్లో ప్రత్యర్థులపై మాటల తూటాలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేయడం ఎంతో అవసరం. అదే సమయంలో మాట పొదుపు, సంయమనం, ఆచితూచి మాట్లాడడం కూడా ఎంతో ముఖ్యం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విషయంలో లెక్క తప్పారు. ప్రత్యర్థులకు చేజేతులా ఆయుధాన్ని అందించారు’ – గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అందుకు కారణమైన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై వ్యక్తమవుతున్న అభిప్రాయాలు.
ఉచిత విద్యుత్‌పై వ్యాఖ్యలు
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి కారణమైన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ‘ఎకరం పొలం తడవాలంటే.. ఒక గంట విద్యుత్ ఇస్తే సరిపోతుంది. మూడెకర్లాల్లో సాగు చేసుకునే రైతులకు మూడు గంటలు విద్యుత్ ఇస్తే సరిపోతుంది. మొత్తంగా చూస్తే ఎనిమిది గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే చాలు. 24 గంటలూ ఇవ్వక్కర్లేదు. అంతేకాకుండా.. రాష్ట్రంలో 95 శాతం మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే’ ఇవి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. అంతేకాకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం కమిషన్ల కోసం కక్కుర్తి పడి 24 గంటలు ఉచిత విద్యుత్ అని మాయ చేస్తోందని కూడా విమర్శించారు. అయితే.. రేవంత్ లెక్కల్లోని శాస్త్రీయత మాట అటుంచితే.. రైతులకు ఉచిత విద్యుత్ అక్కర్లేదు అనే భావన కలిగేలా రేవంత్ వ్యాఖ్యలు ప్రచారంలోకి వెళ్లాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని, ఉచిత విద్యుత్ రద్దు చేస్తుందంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీంతో.. కొన్ని అంశాల్లో ఒక్క మాట పొల్లు పోయినా.. ఎంత నష్టం జరుగుతుందో తాజా పరిణామాలు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు.
అవకాశం అందిపుచ్చుకున్న బీఆర్‌ఎస్
ఇటీవల కాలంలో ఒక వైపు తమ పార్టీలో నెలకొన్న అనిశ్చితి.. అదే సమయంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందున్న వాస్తవాలతో సతమతమవుతున్న అధికార బీఆర్‌ఎస్ పార్టీకి.. టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలు ఒక్కసారిగా ఊపిరిపోశాయని చెప్పొచ్చు. అసలే రేవంత్‌పై దాడి చేసేందుకు వేయి కళ్లతో వేచి చూస్తున్న బీఆర్‌ఎస్ నేతలకు ఆయన ఉచిత విద్యుత్ వ్యాఖ్యలు పదునైన ఆయుధంగా దొరికాయి. దీన్ని ఆసరాగా చేసుకుని మంత్రుల నుంచి మండల స్థాయి నేతల వరకు నిరసనలు చేపట్టడం, రెండు రోజుల పాటు నిరసన దినాలు పాటించాలని స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రకటించడం తెలిసిందే.
‘దేశంలో ఎక్కడా లేని విధంగా.. రాష్ట్రంలో పరిస్థితి కనిపిస్తోంది. అధికార పార్టీనే నిరసనలకు దిగడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు. కానీ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ప్రజల్లోకి ప్రబలంగా తీసుకువెళ్లి.. కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ కలిగించడం లక్ష్యంగా బీఆర్‌ఎస్ శ్రేణులు కదులుతున్నాయి.’ అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
సొంత పార్టీలోనూ భిన్న స్వరాలు
రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ నేతల్లోనూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు రవి తదితర అగ్రనేతలు రేవంత్ అలా మాట్లాడి ఉండకూడదని, ఆయన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని అంటూనే.. లోలోపల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉచిత విద్యుత్‌పై తమకే పేటెంట్ ఉందని.. రేవంత్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా పరిస్థితి తిరగబడిందని మరికొందరు నేతలు అంటున్నారు. ఈ క్రమంలో ఏదైనా మాట్లాడేముందు పార్టీ విధానాలను యాదిలో పెట్టుకోవాలని సొంత అభిప్రాయాలను పార్టీ అభిప్రాయాలు చెబితే.. పూడ్చలేని నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. అంతేకాకుండా.. రేవంత్ వ్యాఖ్యలు, పర్యవసానాలపై ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.
సీఎం ‘సీతక్క’ వ్యాఖ్యలు కూడా వివాదంగా
తానా సభల కోసం అమెరికా వెళ్లిన రేవంత్ నాలుగు రోజుల క్రితం.. అవసరమైతే సీతక్క కూడా సీఎం అవ్వొచ్చు అనే వ్యాఖ్యలు కూడా వివాదంగా మారిన విషయం తెలిసిందే. పార్టీలో అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం, ఉన్నత పదవులు లభిస్తాయనే ఉద్దేశంతో రేవంత్ వ్యాఖ్యానించినప్పటికీ.. సీఎం అభ్యర్థిగా సీతక్కను ఖరారు చేసినట్లుగా మాటలు మారిపోయాయి.
‘అసలే కాంగ్రెస్ పార్టీ. అందులో ప్రతి ఒక్కరూ సీఎం అభ్యర్థి అని భావిస్తారు. తమకు అధిష్టానం అండ ఉందని పేర్కొంటారు. ఇలాంటి పార్టీలో ఉంటూ తన సొంత అభిప్రాయాన్ని పార్టీ మాటగా చెబితే పార్టీ నేతలు సహించలేరు. దీన్ని ఇంకా రేవంత్ అర్థం చేసుకోలేదోమో’ అని విశ్లేషకులు అంటున్నారు.
ఇమేజ్ మొత్తం డ్యామేజ్
ఇక తాజా పరిణామాలతో రేవంత్ రెడ్డి తాను సంపాదించుకున్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసుకున్నారేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. రాష్ట్రంలో కాంగ్రెస్ అంపశయ్యపై ఉన్న పరిస్థితుల్లో పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి.. తన దూకుడు, దుందుడుకు స్వభావం, విపక్షాలపై విరుచుకుపడే తీరుతో పార్టీకి మళ్లీ జవసత్వాలు తీసుకొచ్చారనేది నిస్సందేహం. ఈ రోజున బీజేపీని సైతం వెనక్కు నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా నిలవడం, అధికార బీఆర్‌ఎస్‌కు కంటిలో కునుకు లేకుండా చేయడంలో రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేశారనేది కూడా ఎవరూ కాదనలేని సత్యం. కానీ.. అధాటుగా లేదా శాస్త్రీయ అంచనాలతో చేసిన రెండు వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి ఇమేజ్‌ను డ్యామేజ్ చేశాయనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. దీన్ని బీఆర్‌ఎస్, బీజేపీలతోపాటు కాంగ్రెస్‌లోని సీనియర్లు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
‘ఓటుకు నోటు కేసు నుంచి.. రేవంత్‌ను ఎక్కడ ఇరికించాలా అని చూస్తున్న బీఆర్‌ఎస్‌కు.. ప్రజా కోర్టులో ఇరికించే ఆయుధం దొరికింది. దీన్ని వాళ్లు ఎన్నికల వరకు ఉపయోగిస్తారు. దీనిపై అధిష్టానం రంగంలోకి దిగితేనే పరిష్కారం లభిస్తుంది. కానీ ఇదే సమయంలో రేవంత్‌ను మార్చి వేరే వారికి పీసీసీ పగ్గాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని.. రేవంత్ దూకుడుకు కళ్లెం వేసే విధంగా అధిష్టానం మార్గనిర్దేశం చేసే అవకాశాలున్నాయి.’ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో కొల్లాపూర్‌లో జరగనున్న సభలో అధిష్టానం నుంచి దీనిపై వివరణ వచ్చే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు.
అందుకే.. ప్రజా క్షేత్రంలో ఉన్న వాళ్లు ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే వారే ఎదుటి వారికి ఆయుధంగా మారుతారు. రేవంత్ మాదిరిగానే.. ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదంగా మారాయో తెలిసిందే. గతంలో వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడిన టీడీపీ నేతలు ఇప్పుడు పవన్‌కు మద్దతు పలకడం లేదు. మొత్తంగా చూస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఎలా అడుగులు వేస్తుంది? పార్టీకి జరిగిన డ్యామేజ్‌ను ఎలా పరిష్కరించుకుంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది.