ప్రధాని నరేంద్రమోదీ తన సొంత నియోజకవర్గం వారణాసి లో పర్యటించిన విషయం తెలిసిందే. నూతనంగా నిర్మించిన అమూల్ బనస్ డైరీ ప్లాంట్‌ను ప్రారంభించిన ఆయన.. స్థానికంగా పాల వ్యాపారం సాగిస్తున్న కొంతమంది మహిళలతో ముచ్చటించారు. పశువుల పోషణ, దాని వల్ల ఆర్థికంగా వారికి చేకూరుతున్న ప్రయోజనాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని వారితో సరదాగా మాట్లాడారు.
‘‘గిర్ ఆవుల పెంపకంతో మా కుటుంబ ఆదాయం పెరిగింది. మేం స్వావలంబన సాధించాం. ఈ ఆవులు మా కుటుంబంలో భాగమయ్యాయి’’ అని మహిళలు సంతోషంగా చెప్పారు. దీనికి ప్రధాని స్పందిస్తూ.. ‘‘పాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మహిళల ఖాతాలోనే జమ చేయాలనేది మా ఆలోచన. మీకు ఇప్పుడు ఆదాయం వస్తోంది కదా.. ఇంట్లో మీరు దాదాగిరి చేస్తున్నారా? అయితే, దీని వల్ల మీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే మాత్రం.. మోదీ వల్లే అని అనకూడదు’’ అంటూ సరదాగా అన్నారు. ఆవులతో సెల్ఫీ తీసుకున్నారా? అని మోదీ అడగ్గా.. ఆ పని ఎప్పుడో చేశామంటూ మహిళలు బదులిచ్చారు.
ఆ దృశ్యాలను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘మహిళా సాధికారతకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. గిర్ ఆవులు వచ్చిన తర్వాత వారణాసి తల్లులు, సోదరీమణుల జీవితాలు మారాయని తెలిసి ఎంతో సంతృప్తిగా ఉంది’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
గుజరాత్‌కు చెందిన మేలు జాతి రకమైన ‘గిర్’ ఆవులు భారత్‌తో పాటు అమెరికా, మెక్సికో వంటి దేశాల్లోనూ చాలా పాపులర్. ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ కింద కేంద్ర ప్రభుత్వం వీటిని దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొంతమంది మహిళలకు అందిస్తోంది. తాజాగా ప్రధాని ముచ్చటించిన మహిళలు ఈ పథకం కింద గిర్ ఆవులను పోషిస్తున్న వారే.
మీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే నన్ను అనొద్దు
- Advertisement -
- Advertisement -