జై తెలంగాణ అని నినాదం చేస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా..?
పోలీసుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం
స్వయంగా ఎస్పీ అంబర్ షాతో ఫోన్ లో మాట్లాడిన కేటిఆర్
కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్న కేటీఆర్
న్యాయస్థానాలు, మానవహక్కుల సంఘాలను ఆశ్రయిస్తామని స్పష్టీకరణ
పరకాల ఘటనలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించిన కేటిఆర్
గులాబీ సైనికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ
కార్యకర్తలు ఏమాత్రం అధైర్యపడొద్దని భరోసానిచ్చిన కేటిఆర్
వరంగల్
పరకాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఇవాళ చలో మేడిగడ్డ కు వెళుతున్న సందర్భంగా మార్గమధ్యలో కలిసి కేటీఆర్ పరామర్శించారు. పరకాలలో జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పరకాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఇవాళ చలో మేడిగడ్డ కు వెళుతున్న సందర్భంగా మార్గమధ్యలో కలిసి పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. వెంటనే జిల్లా ఎస్పీ అంబర్షాతో ఫోన్ లో మాట్లాడారు. కొంతమంది స్థానిక పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని తప్పుబట్టారు. కార్యకర్తలను పోలీసు స్టేషన్లకు పిలిపించి వేధిస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని… పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, ఉద్యమంలో ఇలాంటి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ పార్టీ మనదని గుర్తుచేశారు. స్థానిక పోలీస్ అధికారిని సస్పెండ్ చేసినా, పార్టీ కార్యకర్తలపైన పోలీసుల దమనకాండ ఆగడం లేదని ఈ సందర్భంగా పరకాల నేతలు కేటిఆర్ దృష్టికి తీసుకొచ్చారు. పరకాలలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షగట్టిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. ఢిల్లీ వరకు వెళతామని, న్యాయస్థానాలతోపాటు మానవహక్కుల సంఘాలను ఆశ్రయించి వారిపై చర్యలు తీసుకునే వరకూ పోరాటం కొనసాగిస్తామని కేటిఆర్ స్పష్టంచేశారు. పరకాల వంటి సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడ పునరావృతమైనా పార్టీ యంత్రాంగం చూస్తూ ఊరుకోబోదమని కేటిఆర్ స్పష్టంచేశారు.
జై తెలంగాణ అని నినాదం చేస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా..?
- Advertisement -
- Advertisement -