- Advertisement -
విలేఖరులపై అక్రమ కేసు నమోదు
చేసిన ఎస్సై సస్పెన్షన్ !
Illegal case registered against journalists
SI suspension done!
ఏపీ పోలీస్ లు పైన చర్యలు తీసుకోవాలి
ఛత్తీస్ ఘడ్ పోలీస్ శాఖ స్పందనకు ఎ.పి.యు.డబ్ల్యు.జే. హర్షం!
విలేఖరులపై అక్రమకేసు నమోదుకు కుట్ర చేసిన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుక్మ జిల్లా కొంట పోలీసు సబ్ ఇన స్పెక్టర్ అజయ్ సోంకర్ ను ఆ రాష్ట్ర పోలీసు శాఖ సస్పెండ్ చేయడాన్ని ఎ.పి.యు.డబ్ల్యూ.జే. స్వాగతించింది. కుంట పోలీసులతో కుమ్మక్కైన చింతూరు పోలీసు అధికారులపై కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యూనియన్ డిమాండ్ చేసింది. ఆమేరకు ఏ.పీ.యు.డబ్ల్యూ.జే . రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు , ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ , ఐజేయు జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ , జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు , విశాఖ రూరల్ జిల్లా శాఖ నాయకులు ఎం. బి.ఆర్.ఎల్. స్వామి, జాతీయ కౌన్సిల్ సభ్యులు శ్రీరామమూర్తి, నాగరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలోని అంశాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు పదో తేదీ రాత్రి ఛత్తీస్ ఘడ్ కు చెందిన ఆరుగురు విలేఖరులపై అక్రమ కేసు నమోదు చేసిన విషయంలో కొంట ఎస్సై పాత్రపై ఛత్తీస్ ఘడ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఫిర్యాదు చేసింది. అక్రమ కేసు ఎత్తివేయాలని ఆందోళన చేపట్టింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది. సోషల్ మీడియాలో పోలీసులపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. దానిపై సుక్మా జిల్లా ఎస్పీ స్పందించారు. ముగ్గురు సభ్యులు గల ఒక దర్యాప్తు కమిటీని నియమించారు. ఎస్సై పై ఆరోపణల పూర్వాపరాలను ఆ కమిటీ విచారించి నివేదిక ఇచ్చింది. విలేఖరులపై అక్రమకేసు మోపడంలో ఎస్సై పాత్ర అనైతికంగానే కాకుండా చట్ట విరుద్ధంగా ఉందని త్రిసభ్య కమిటీ పేర్కొన్నది. దానిపై ఎస్సై అజయ్ సొంకర్ ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ కిరణ్ చౌహాన్ ప్రకటించారు. అక్రమ కేసు నమోదు వెనుక గల కుట్రపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ ప్రకటించారు. ఎస్పీ ప్రకటనను ఎ.పి.యు.డబ్ల్యు.జే. నాయకులు స్వాగతిస్తూ , కొంట ఎస్సై తో కుమ్మక్కై విలేకరులను అక్రమంగా అరెస్టు చేసిన ఆంధ్రప్రదేశ్ చింతూరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం జర్నలిస్టుల భద్రతకోసం 2023 మార్చ్ 22 వ తేదీనుండి ఒక ప్రత్యేక చట్టాన్ని అమలులోకి తెచ్చిందని , ఆచట్టంలోని నియమాల ప్రకారం జర్నలిస్టులపై దాడులు చేసే వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు పెట్టడమే కాకుండా అక్రమ కేసులు నమోదు చేసే అధికారులపై చర్యలు తీసుకునేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయని యూనియన్ నాయకులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాంటి చట్టం ఉన్నందునే విలేఖరులపై అక్రమ కేసు నమోదు చేయడానికి కుట్ర చేసిన ఎస్సైని కేవలం 48 గంటల్లో సస్పెండ్ చేయడం జరిగిందని వారు తెలిపారు. ఛత్తీస్ ఘడ్ పోలీస్ ఉన్నతాధికారులు స్పందించిన తీరుకు యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఛత్తీస్ ఘడ్ తరహా చట్టాన్ని భారతదేశం అంతటా అమలు చేయాలని, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అలాంటి చట్టాన్ని తీసుకు రావాలని ఐ.జే.యు., ఎ.పి.యు.డబ్ల్యూ.జే. నాయకులు డిమాండ్ చేశారు.
- Advertisement -



