- Advertisement -
మంచిర్యాలలో నేలమట్టమైన అక్రమ కట్టడం
Illegal construction in Mancharya
అదిలాబాద్, సెప్టెంబర్ 19, (వాయిస్ టుడే)
తెలంగాణలో ‘హైడ్రా’ దూకుడు కొనసాగుతోంది. చెరువులు, ప్రభుత్వ భూములు, ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారులతో పాటు సామాన్యులకు సంబంధించిన అక్రమ నిర్మాణాలను సైతం హైడ్రా అధికారులు కూల్చేశారు. తాజాగా, గురువారం మంచిర్యాల జిల్లాలోనూ హైడ్రా ఎఫెక్ట్‌తో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. నస్పూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 42లో అక్రమంగా నిర్మించిన భవనాన్ని అధికారులు కూల్చివేశారు. బీఅర్ఎస్ నేత డీకొండ అన్నయ్యకి చెందిన ఐదంతస్తుల భవనాన్ని పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్, రెవెన్యూ శాఖ అధికారులు కూల్చివేతలు చేపట్టారు.క్రమంలో ఇంటి యజమానిని ముందస్తు చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూల్చివేతను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన కుటుంబ సభ్యులను పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నస్పూర్ మున్సిపాలిటీలోని 42 సర్వే నెంబరులో బీఆర్ఎస్ నేత డీకొండ అన్నయ్య అక్రమంగా ఐదంతస్తుల భవనాన్ని నిర్మించారని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ భవన నిర్మాణానికి సర్వే నెంబర్ 40లో అనుమతులు తీసుకుని సర్వే నెంబర్ 42లో భవన నిర్మాణం చేపట్టారని మున్సిపల్ కమిషనర్ సతీష్ తెలిపారు. 2022 నుంచి నోటీసులు ఇస్తున్నా డీకొండ అన్నయ్య పట్టించుకోలేదని చెప్పారు. 15 రోజుల కిందట కూడా నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. అయినా వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీస్ అధికారుల సాయంతో భవనాన్ని కూల్చివేశామని స్పష్టం చేశారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మరిన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయని గుర్తించామన్నారు. త్వరలోనే వాటిని సైతం గుర్తించి కూల్చివేస్తామన్నారు.మంచిర్యాల జిల్లాలో హైడ్రా ఎఫెక్ట్‌తో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఈ క్రమంలో తమ తమ ప్రాంతాల్లో కబ్జాలపై ఉక్కుపాదం మోపాలని అక్కడి స్థానికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా, అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో ‘హైడ్రా’ పని ఆగదని కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపై తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని సీఎం రేవంత్ తేల్చిచెప్పారు. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ రాబోయే రోజుల్లో ‘హైడ్రా’ ప్రభావం ఇలాగే కొనసాగుతుందా.? లేదా.? అనేది చూడాల్సి ఉంది.
- Advertisement -