- Advertisement -
ట్రిపుల్ ఐటీలో 113 మంది విద్యార్ధుల అస్వస్థత
Illness of 113 students in Triple IT
ఏలూరు, ఆగస్టు 31, (న్యూస్ పల్స్)
ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు. తాజాగా, 113 మంది విద్యార్థులు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ 1300 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. నాణ్యత లేని ఆహారం, అపరిశుభ్ర వాతావరణంతో గతం వారం రోజులుగా వందల మంది విద్యార్థులు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోనే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ నెల 23 నుంచి విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం మొదలైంది. ప్రధానంగా 3 మెస్‌ల్లో ఆహారం తిన్న విద్యార్థులు చాలా మంది అనారోగ్యం పాలు కాగా.. గత 4 రోజులుగా తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఆదివారం 165, సోమవారం 229, మంగళవారం 345, బుధవారం 131, తాజాగా 113 మంది ఆస్పత్రుల్లో చేరారు. అయితే, పిల్లల ఆరోగ్య పరిస్థితిపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై కమిటీ వేశామని ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారి తెలిపారు. కాగా, కాలేజీ యాజమాన్యం తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు, ట్రిపుల్ ఐటీని తనిఖీ చేసేందుకు వెళ్లిన గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథికి విద్యార్థులు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. మంత్రి కాలేజీ పరిసరాలు, మెస్‌లను పరిశీలించగా.. అక్కడి దారుణాలను ఆయనకు కళ్లకు కట్టినట్లు చూపించారు. దుర్వాసన వస్తోన్న కూరలు, అపరిశుభ్రంగా ఉన్న వంటగది, నాణ్యత లేని భోజనం వంటి వాటి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వాపోయారు. దీనిపై స్పందించిన మంత్రి ట్రిపుల్ ఐటీపై దృష్టి సారిస్తామని చెప్పారు. జిల్లా వైద్యాధికారి కాలేజీని పరిశీలించారని.. ఆ నివేదిక ప్రకారం చర్యలు చేపడతామని అన్నారు. అనంతరం మంత్రి అధికారులు, మెస్ నిర్వాహకులతో సమావేశమై.. కాలేజీ, మెస్ నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీలో మంత్రి పార్థసారథి పర్యటించినా.. నారా లోకేశ్ ట్వీట్ చేసినా పరిస్థితి ఏమాత్రం మారలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మంత్రి పరిశీలించిన అనంతరం కూడా అల్పాహారంలో పాడైన గుడ్లు, రుచీ పచీ లేని ఉప్మా పెట్టారని వాపోయారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీ ఆస్పత్రుల్లోనూ అరకొర సౌకర్యాలే ఉన్నాయని అన్నారు. రోగుల సంఖ్య తక్కువగా చూపించేందుకు ఓపీలు కూడా రాయడం లేదని.. ఆరోగ్య పరిస్థితి విషమించినా మందులిచ్చి పంపేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇన్ పేషెంట్లుగా జాయిన్ చేసుకోవడం లేదని పేర్కొంటున్నారు.అటు, అల్లూరి జిల్లాలోని అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగుడ మండలం బొందుగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాత్రి 50 మంది విద్యార్థులు రాత్రి ఆహారం తిని వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని గమనించిన సిబ్బంది వెంటనే వారిని అరకులోయలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు.
భోజనం బాగోలేదని..
మరోవైపు, అంబేడ్కర్ జిల్లా కె.గంగవరం మండలంలోని బట్లపలిక స్కూల్‌లో భోజనం బాగోలేదని విద్యార్థులు నిరసన తెలిపారు. భోజనం నాణ్యత లేదని పదే పదే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైసీపీ విమర్శలు చేసింది. విద్యార్థులు ఆకలితో ఇంటికి వెళ్లిపోతున్నారంటూ.. ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
- Advertisement -