28 నుంచి మథురలో
ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కౌన్సిల్ సమావేశాలు
in Mathura
IFWJ National Council Meetings
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మథుర(బృందావన్)
లో జరుగుతాయని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, ఐఎఫ్ డబ్ల్యూజే వర్కింగ్ కమిటీ సభ్యుడు మామిడి సోమయ్య, ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం తెలిపారు. గురువారం హైదరాబాద్ లో వారు మీడియాతో మాట్లాడుతూ, ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ అధ్యక్షులు కే. విక్రమ్ రావు అధ్యక్షతన మూడు రోజుల పాటు మథుర(బృందావన్)లో జరగనున్న ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో తెలంగాణ ప్రతినిధులతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఐఎఫ్ డబ్ల్యూజే ఆఫీస్ బేరర్లు, జాతీయ కౌన్సిల్ సభ్యులు, ఆయా రాష్ట్రాల అనుబంధ జర్నలిస్టు యూనియన్ ల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశాల సందర్భంగా
నేషనల్ కన్ఫడరేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్, న్యూస్ ఏజన్సీస్ ఎంప్లాయిస్ యూనియన్ ల సమావేశం కూడా జరుగుతుందని, దీనికి కాన్ఫడరేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఇంద్రకాంత్ దీక్షిత్ నేతృత్వం వహిస్తారని తెలిపారు.
దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, ఆయా రాష్ట్రాలలో జర్నలిస్టుల సమస్యలపై సమావేశాల్లో చర్చించి కార్యాచరణను రూపొందిస్తారని తెలిపారు. ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను మీడియ కౌన్సిల్ గా మార్పు, డిజిటల్, సోషల్ మీడియా ఎదుర్కొంటున్న సమస్యలు, జాతీయ పెన్షన్ విధానం, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తదితర అంశాలపై సమావేశాల్లో చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశాలలో తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు యాభై మంది జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు, వివిధ జిల్లాల ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొంటారని, వీరంతా ఈనెల 27న బయలుదేరి 28వ తేదీన సమావేశాలకు హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ మెంబర్ యర్రమిల్లి రామారావు పాల్గొన్నారు.


