కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసు లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి ఊరట లభించింది. ఆరేళ్ల క్రితం నాటి ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్ జిల్లా కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా యూపీలోనే ఉన్న రాహుల్ కేసు విచారణ నిమిత్తం మంగళవారం కోర్టు ఎదుట హాజరయ్యారు.
2018 మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాహుల్.. కేంద్రమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాడు బెంగళూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రాజకీయాల్లో స్వచ్ఛంగా, నిజాయతీగా ఉంటామని చెప్పే భాజపా .. ఓ హత్య కేసులో నిందితుడిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంది’’ అని ఆరోపించారు. ఆ సమయంలో అమిత్ షా.. భాజపా జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు.
ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలోనే యూపీకి చెందిన భాజపా నేత విజయ్ మిశ్రా అదే ఏడాది ఆగస్టులో రాహుల్‌పై ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై గతంలో పలుమార్లు న్యాయస్థానం ఆయనకు సమన్లు జారీ చేయగా రాహుల్ స్పందించలేదు. తాజాగా విచారణకు హాజరవ్వగా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అమిత్ షా పై అనుచిత వ్యాఖ్యల కేసు
- Advertisement -
- Advertisement -