షటిల్ ఆడుతూ గుండెపోటు
హైదరాబాద్, ఆగస్టు 16: కరీంనగర్ లో ఫ్రెషర్స్ డే రోజు ఇంటర్ విద్యార్థిని డ్యాన్స్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన ఘటన మరువకముందే షెటిల్ ఆడుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన రామంతపూర్ లో చోటుచేసుకుంది. ఉదయం సెటిల్ ఆడుతూ కృష్ణారెడ్డి అనే వ్యక్తి కుప్పకూలిపోయాడు. అయితే అక్కడే వున్న వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే కృష్ణారెడ్డిని పరీక్షించిన వైద్యులు మరణించినట్లు నిర్ధారించారు. కృష్ణారెడ్డికి గుండెపోటు రావడం వల్లే మృతి చెందారని తెలిపారు. షెటిల్ ఆడుతుండగా కృష్ణారెడ్డి ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం ఆగి ఉంటుందని అది గమనించకుండా షెటిల్ అలాగే ఆడినందువల్లే మృతి చెంది ఉంటారని వైద్యులు తెలిపారు. అయితే.. ఉదయాన్నే షెటిల్ ఆడటానికి ఇంటి నుంచి బయలు దేరిన వ్యక్తి ఇలా మృత్యువాత పడటం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇంటికి పెద్దదిక్కైన కృష్ణారెడ్డి మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఆకస్మిక గుండెపోటు మరణాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. చిన్నతనం నుంచి మధ్య వయసు వరకు చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకుని ప్రాణాలు విడిచాడు. మృతుల్లో చిన్నారుల నుంచి మధ్య వయస్కుల వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అప్పటి వరకు తోటి విద్యార్థులతో ఆడుకుంటున్న చిన్నారులు గుండెపోటుకు గురై క్షణాల్లో మృత్యువాత పడ్డారు. వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మారిన ఆహారపు అలవాట్లు, కలుషిత ఆహారం, సమయపాలన లోపం, పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, ఇతర ఆరోగ్య సమస్యలే గుండెపోటుకు ప్రధాన కారణమని పలువురు వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. శారీరక శ్రమ లేకపోవడంతో పాటు రోజువారీ జీవితంలో మానసిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు, కిడ్నీ సమస్యలు, గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.