న్యూఢిల్లీ, డిసెంబర్ 6, (వాయిస్ టుడే): ఇండియా కూటమి భేటీ రద్దు చేస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో జరగాల్సిన ఇండియా కూటమి సమావేశం రద్దయినట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈనెల మూడోవారంలో సమావేశం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశానికి హాజరుకావడం లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందన్న భావన ఇండియా కూటమి నేతల్లో నెలకొంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసిందని , మిత్రపక్షాలను పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ వేర్వేరుగా మధ్యప్రదేశ్‌లో పోటీ చేశాయి. విపక్షాల ఓట్లు చీలడంతోనే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. దీనికి కాంగ్రెస్ వైఖరే కారణమని మండిపడ్డారు.అంతేకాకుండా.. కాంగ్రెస్ కలుపుకునిపోకపోవడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయన్న విమర్శలు సైతం కూటమిలోని నేతల నుంచి వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినా, ఇండియా కూటమి ఓట్లు చీలడం వల్ల మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. సీట్ల సర్దుబాటు ఉండాలని తాము చెప్పామని కానీ కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే సైద్ధాంతిక బలంతోపాటు, వ్యూహం కూడా అవసమని అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల్లో గెలవాలంటే, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటే, బీజేపీ అధికారంలోకి రాదన్నారు.