భారీగా పతనమయిన భారత స్టాక్ మార్కెట్లు
రికార్డు స్థాయిలో సెన్సెక్స్ 3వేల పాయింట్లు పతనం కాగా.. నిఫ్టీ వెయ్యి పాయింట్లకుపైగా పతనం
ముంబై ఏప్రిల్ 7
Indian stock markets plunge sharply
; భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. రికార్డు స్థాయిలో సెన్సెక్స్ 3వేల పాయింట్లు పతనం కాగా.. నిఫ్టీ వెయ్యి పాయింట్లకుపైగా పతనమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో పాటు అమెరికా స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. మరో వైపు ఆసియా మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. హాంకాంగ్, చైనా మార్కెట్లు దాదాపు 10శాతం పతనమ్యాయి. ఈ భయాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ క్రమంలోనే సోమవారం ప్రారంభంలోనే సెన్సెక్స్ 3వేల పాయింట్లుకుపైగా పతనమైంది. నిఫ్టీ వెయ్యి పాయింట్లకుపైగా తగ్గింది. ప్రస్తుతం సెన్సెక్స్ 2540.33 పాయింట్లు తగ్గి.. 72824.03 వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ 817.5 పాయింట్లు తగ్గి.. 22806.95 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. ఇక డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి 30 పైసలు తగ్గి 85.74కి చేరింది.ఏప్రిల్ 4న బీఎస్‌ఈలో జాబితా అయిన అన్ని షేర్ల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.4,03,34,886.46 కోట్లు ఉండగా.. నేడు మార్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికి రూ.3,83,95,173.56 కోట్లకు తగ్గింది. ప్రారంభంలోనే పెట్టుబడిదారుల మూలధనం రూ.19,39,712.9 కోట్ల సంపద ఆవిరైంది. ఏప్రిల్ 3న బీఎస్‌ఇలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4,13,33,265.92 కోట్లుగా ఉన్నది. సెన్సెక్స్‌లో భారతి ఎయిర్‌టెల్ మాత్రమే గ్రీన్ జోన్‌లో ఉంది. కానీ, కేవలం ఒకశాతం కంటే తక్కువగానే పెరిగింది. మరో వైపు ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ భారీ నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈలో 2289 షేర్లు ట్రేడవుతున్నాయి. ఇందులో 1,029 స్టాక్‌లు బలంగా కనిపిస్తున్నా.. 1,101 నష్టాల్లో కొనసాగుతున్నాయి. 24 షేర్లు ఒక సంవత్సరం గరిష్ట స్థాయికి, 23 షేర్లు ఒక సంవత్సరం కనిష్ఠానికి చేరాయి. ప్రస్తుతం నిఫ్టీలో గోద్రెజ్ కన్జ్యూమర్, ట్రెంట్ ఫార్మా మాత్రమే లాభాల్లో ఉండగా.. ట్రెంట్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్ టెక్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జియో ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, అదానీ పోర్ట్స్ భారీగా నష్టాల్లో కొనసాగుతున్నాయి.