మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
-165 మహిళా సంఘాలకు 20.67 కోట్ల బ్యాంక్ లింకెజ్ యూనిట్ల పంపిణీ
-అభివృద్ధి లో ఆదర్శవంతంగా మంథని ని తీర్చిదిద్దుతాం
-13.95 కోట్లతో 7 ప్యాకేజీలలో అభివృద్ధి పనులు
-మంథనిలోనే అభివృద్ధి పనుల శంకుస్థాపన, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి
Indira Mahila Shakti aims to make women millionaires
మంథని
మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం రూపొందించిందని, మహిళలు వ్యాపారాలలో రాణించి గొప్పగా ఎదగాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆకాంక్షించారు.
బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథనిలోనే అభివృద్ధి పనుల శంకుస్థాపన, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి ప్రారంభించారు.
15వ ఆర్థిక సంఘం నిధులు 24 లక్షల 50 వేల రూపాయలతో మంథని పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు కొనుగోలు చేసిన 3 స్వచ్ఛ ఆటో లను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ అభివృద్ధిలో మంథని పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. టి.యూ.ఎఫ్.ఐ.డి.సి క్రింద 13 కోట్ల 95 లక్షల రూపాయలతో 7 ప్యాకేజీలలో మంథని పట్టణంలోని ప్రతి వార్డుకు సిసి రోడ్లు, సిసి డ్రైయిన్లు కల్పించేలా శంకుస్థాపన చేసుకున్నామని, ఈ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు.
మంథని పట్టణంలో నూతన పురపాలక భవనం, సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం మొదలగు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు గృహావసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వంటి పలు పథకాలను అమలు చేశామని తెలిపారు.మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం రూపొందించిందని, వచ్చే 5 సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల బ్యాంకు రుణాలు అందజేసి మహిళలచే వివిధ వ్యాపార వాణిజ్య యూనిట్ల స్థాపనకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు.
గతంలో తమ ప్రభుత్వ హయాంలో పాపుల వడ్డీ పథకాన్ని ప్రారంభించి స్వ శక్తి మహిళా సంఘాల సభ్యులను లక్షాదికారులను చేశామని మంత్రి గుర్తు చేశారు. మహిళలచే 12 రకాల వాణిజ్య వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు అవకాశాలు గుర్తించామని, మార్కెట్ లో డిమాండ్ ప్రకారం వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.మంథని ప్రాంతంలో 40 లక్షల వ్యయంతో 25 మహిళా సంఘాలచే మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేశామని అన్నారు. ప్రస్తుతం 165 మహిళా సంఘాలకు 20 కోట్ల 67 లక్షల బ్యాంక్ లింకేజీ రుణం పంపిణీ చేస్తున్నామని, వీటినీ మహిళలు వినియోగించుకుని వ్యాపార రంగంలో ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలు విషయంలో స్థానిక సంస్థ అదనపు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి సూచించారు. ఒక సంవత్సర కాలంలో క్వాలిటేటివ్ చేంజ్ రావాలని, స్వశక్తి మహిళా సంఘాల రుణాలు సద్వినియోగం అయ్యే విధంగా ప్రణాళికబద్ధంగా పనిచేయాలని మంత్రి సూచించారు.అనంతరం ఎంపి గడ్డం వంశీ కృష్ణ మాట్లాడుతూ* గత పది సంవత్సరాల కాలంగా అభివృద్ధి పనులు చేపట్టకపోవడం వల్ల మంథని వెనుకబడిందని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళా సంఘాలకు అందించే రుణాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు వ్యాపార రంగంలో ఎదగాలని ఎంపీ కోరారు. మంథని పట్టణంలో నేడు ప్రారంభించిన 3 స్వచ్చ ఆటోలను వినియోగిస్తూ పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడే విధంగా చూడాలని అధికారులకు ఎంపీ సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ రమా సురేష్ రెడ్డి, మంథని రెవెన్యూ డివిజన్ అధికారి వి.హనుమా నాయక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.



