క్యూర్ పరిధిలోఇందిరమ్మ ఇండ్లు. .మార్చి చివరి నాటికి లబ్దిదారుల ఎంపిక
అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి చర్యలు
యుద్ధప్రాతిపదికన లబ్దిదారుల ఎంపిక
ఆర్,ఆర్, ఆర్, – ఓ ఆర్ ఆర్ మధ్య అఫర్డ్‌బుల్ హౌసింగ్ పాలసీ
క్యూర్ పరిధిలో హౌసింగ్ పాలసీపై అధికారులతో
మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ సమీక్ష
హైదరాబాద్ ఫిబ్రవరి 18
Indiramma Houses under Cure. Selection of beneficiaries by end of March
హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ)పరిధి లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి వచ్చే మార్చి చివరినాటికి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించారు. మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్ధలాల సేకరణ,అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి, పూర్తయిన ఇండ్ల కేటాయింపు తదితర అంశాలపై మంగళవారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తో కలిసి సమీక్షించారు. ఈ సమావేశంలో హౌసింగ్ కార్యదర్శి విపి గౌతమ్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమీషనర్లు పాల్గొన్నారు. పట్టణాల్లోని మురికివాడల్లో జీవనం కొనసాగిస్తున్న పేదలు అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారని ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఇండ్లు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని హైదరాబాద్‌కు దూరంగా గతంలో 42వేల ఇండ్లను నిర్మించగా అందులో సగం మంది మాత్రమే అక్కడ నివసిస్తున్నారని ఇటీవల నిర్వహించిన క్షేత్రస్ధాయి సర్వేలో తేలిందని సమావేశంలో అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. అలాగే చాలాచోట్ల బోగస్ లబ్దిదారులు కూడా ఉన్నారని అధికారులు మంత్రులకు వివరించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ,నిరుపేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా, వారి నివాస ప్రాంతాలకు దగ్గరగా స్ధానిక పరిస్ధితులను బట్టి ఐదు నుంచి 10 అంతస్ధుల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలనే ఆలోచన చే్స్తున్నామని ,వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ముగ్గురు మున్సిపల్ కార్పొరేషన్ల కమీషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో వారి వారి ప్రాంతాలలో స్ధలాలను గుర్తించి ఎన్ని ఇండ్లు నిర్మించవచ్చు, ఎంతమంది లబ్దిదారులు ఉన్నారు వంటి వివరాలతో పదిరోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మురికివాడల్లో స్ధలం ఉన్నవారు అంగీకరిస్తే ఆ ప్రాంతంలో జీప్లస్ 5 వరకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి అభివృద్ది చేయాలన్న ఆలోచన చేస్తున్నామని జేఎన్ఎన్‌యూ ఆర్ ఎం పధకంలో నిర్మించిన ఇండ్లు శిధిలావస్ధకు చేరాయని వాటి స్ధానంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే ఆలోచన చేస్తున్నామన్నారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇండ్ల స్ధలాలు ఉన్న 28వేల మంది లబ్దిదారులకు ఈనెల చివరిలోగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న, ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మార్చి చివరినాటికి లబ్దిదారులను ఎంపిక చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇండ్లకు లబ్దిదారులను గుర్తించి ఆ లబ్దిదారులే ఆ ఇండ్లను పూర్తి చేసుకోవడానికి అంతకుముందు ఖర్చుచేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని మిగిలిన నిధులను హౌసింగ్ కార్పొరేషన్ నిధులను మంజూరు చేస్తుందని తెలిపారు. చాలా చోట్ల ఇండ్లు తీసుకొని అక్కడ నివాసం లేని వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని , అలాగే బోగస్ లబ్దిదారులను కూడా గుర్తించాలని అధికారులకు స్సష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనర్హుల స్ధానంలో రాజకీయాలకు అతీతంగా సమీపంలో ఉన్నఅర్హులైన పేదలను ఎంపిక చేయాలని కలెక్టర్లకు సూచించారు. 2 బిహెచ్‌కే నివాస ప్రాంతాలలోని ప్రతి ఇంటికి తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ వంటి కనీస వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ పంపిణీ సంస్ధలు విద్యుత్ మీటర్లను లబ్దిదారుల పేర్లకు బదిలీ చేయాలని అలాగే 2బిహెచ్‌కే కాలనీల్లో తాగునీటి సరఫరా మౌలిక సదుపాయాలు, ఎస్టీపీలు, మరియు యూజీడీల వ్యవస్ధ హైదరాబాద్ వాటర్ బోర్డు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.ఆర్,ఆర్, ఆర్, – ఓ ఆర్ ఆర్ మధ్య అఫర్డ్‌బుల్ హౌసింగ్ పాలసీ ఆర్,ఆర్, ఆర్, – ఓ ఆర్ ఆర్ పరిధిలో మధ్యతరగతి ప్రజల కోసం గతంలో కెపిహెచ్‌బిలో నిర్మించిన మాదిరిగానే ఇండ్లను నిర్మిస్తామని ఇందుకు నాలుగు ప్రాంతాల్లో స్దలాలను గుర్తించి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.



