- Advertisement -
హూజూర్ నగర్ దవాఖానాలో అమానుషం
Inhumanity in Huzur Nagar Hospital
నల్గోండ, సెప్టెంబర్ 19, (వాయిస్ టుడే)
రాష్ట్రంలోని సర్కార్ దవాఖానాల్లో వెత్తు నిర్లక్ష్యానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ. నిత్యం ఎన్నో దారుణాలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో అభాగ్యుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. ఓ మహిళకు పురిటినొప్పులు రావడంతో కాన్పు కోసమని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. సర్కారు దవాఖానాలో తనకు పురుడు పోసి బిడ్డను తన చేతుల్లో పెడతారని ఎంతో నమ్మకం పెట్టుకొని వచ్చిన ఆ నిండు గర్భిణీ నరకం చూసింది. సాధారణ ప్రసవం కావాలని సిబ్బంది చేసిన నిర్వాకంతో సదరు మహిళ మానసికంగా, శారీరకంగా ఎంతో వేదన అనుభవించింది. డ్యూటీలో ఉన్న డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సులు బూతులు తిడుతూ, ఇష్టంవచ్చినట్టు కొట్టినా పుట్టబోయే తన పాపాయి కోసం అన్నీ భరించింది. కానీ చివరికి ఆ తల్లి చేతుల్లోనే బిడ్డ ఊపిరి వదలడం చూసి తట్టుకోలేక గుండెలవిసేలా రోధించింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఏరియా దవాఖానలో నర్సులు చేసిన అమానవీయ వైద్యం ఓ పసికందు నిండు ప్రాణం తీసింది. వివరాల్లోకెళ్తే..సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఏరియా దవాఖానలో దారుణం జరిగింది. మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాకు చెందిన పాసిపాక నాగరాజు భార్య రేణుకకు ఆదివారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో హుజూర్‌నగర్ ఏరియా దవాఖానకు కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఆ సమయంలో డ్యూటీలో ఉండవల్సిన వైద్యులు అందుబాటులో లేకపోయినా నర్సులు అడ్మిట్ చేసుకున్నారు. రాత్రి వరకూ వైద్యం అందించకపోవడంతో భర్త నాగరాజు సిబ్బందిని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన నర్సులు రేణుకను బూతులు తిడుతూ నొప్పులు రావాలని.. నిండు గర్భిణిని కాలుతో ఇష్టం వచ్చినట్లు తొక్కారు. సోమవారం తెల్లవారుజామున రేణుకకు సాధారణ ప్రసవం అయ్యింది. బిడ్డ బయటకు వచ్చిన కాసేపటికే శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే నాగరాజు శిశువును తీసుకుని అక్కడికి వెళ్లేలోగా పసికందు మృతి చెందాడునాగరాజు సూర్యాపేట డీఎంహెచ్‌వో కోటాచలానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో డీఎంహెచ్‌వో హుజూర్‌నగర్ ఏరియా వైద్యశాలకు వచ్చి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. శిశువు పోస్టుమార్టమ్ రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. డ్యూటీ డాక్టర్ లేరని నర్సులు అమానవీయంగా ప్రవర్తించారని డీఎంహెచ్‌వోకు చెప్పి రేణుక కన్నీటిపర్యంతమైంది. నిండు గర్భంతో ఉన్న తనను నర్సులు కడుపుపై కాలితో తొక్కారని, తన బిడ్డను చంపారని విలపించింది. డ్యూటీ డాక్టర్‌తో పాటు నర్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని రోదిస్తూ చెప్పింది.
- Advertisement -