కులగణన చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లితే సామూహిక ఆమరణ దీక్ష: ఆర్.కృష్ణయ్య
Initiation of mass death if local elections go without caste census:
ఆరోగ్యం సహకరించకపోయినా ఆమరణ దీక్ష చేస్తా: ఆర్.కృష్ణయ్య
42 శాతం రిజర్వేషన్ కి ప్రతీకగా 42 మందితో సామూహిక ఆమరణ దీక్ష: రాజారాం యాదవ్
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వైఖరిని ఎండగడతామని
బీసీ సంఘాల హెచ్చరిక
కులాలు, సంఘాలు, పార్టీలకు అతీతంగా ఐక్య పోరాటాలకు అందరూ కలిసి రావాలని బీసీ సంఘాల పిలువు
కులగణన చేయకుండా స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే..అదే రోజు సామూహిక ఆమరణ దీక్షకు దిగుతామని బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. శుక్రవారం ఉదయం వివిధ బీసీ సంఘాలు, బీసీ కుల, సంఘాలు, విద్యార్థి సంఘాలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేఖరుల సమావేశం నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య..కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల సీట్ల కేటాయింపుల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. కనీసం బీసీలకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అయ్యే అర్హత కూడా లేదా అని ప్రశ్నించారు. కులగణన చేయకుండా ప్రభుత్వం సాకులు చెప్పితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. బీసీల విశ్వసనీయత కోల్పోకముందే.. కాంగ్రెస్ ప్రభుత్వానికీ ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. నా ఆరోగ్యం బాగోలేకపోయినా సామూహిక ఆమరణ దీక్షకు దిగుతానని ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. అధికార పార్టీలో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు సమగ్ర కులగణనపై ఆయా పార్టీలపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. కాబట్టి, కులాలు, సంఘాలు, పార్టీలకు అతీతంగా తెగించి పోరాడాలని ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు.
మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ చేసి తీరుతుందని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎందుకు అమలు చేయడం లేదని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రశ్నించారు. సమగ్ర కులగణన చేయకుండా, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికల షెడ్యూల్ ఇస్తే..అదే రోజు 42 శాతానికి ప్రతీకగా 42 మందితో సామూహిక ఆమరణ దీక్ష చేస్తామని రాజారాం యాదవ్ ప్రకటించారు. జాతీయస్థాయిలో సమగ్ర కులగణన చేస్తామని, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీకి.. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరిని జాతీయ స్థాయిలోనే ఎండగడతామని అన్నారు.
ప్రాణాలు పోయినా సరే.. సామూహిక ఆమరణ దీక్ష చేసి సమగ్ర కులగణన, స్థానిక సంస్థల్లో 42 శాతం సాధిస్తామని హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వర్లు ప్రకటించారు. ఆర్.కృష్ణయ్య దీక్ష చేస్తానని ప్రకటించడం అందరికి ఎంతో స్ఫూర్తినిచ్చిందని అన్నారు. బీసీలు వేసిన ఓట్ల బిక్షతో సీఎం పీఠం ఎక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక మొండి చేయి చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆరోపించారు. సమగ్ర కులగణన చేయకుండా, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లితే, బీసీల ఆగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. సమగ్ర కులగణన చేయకుండా బీసీలను తప్పుదోవ పట్టించే కుట్రలు ప్రభుత్వం చేస్తోందని సోషల్ జస్టిస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిడికిలి రాజు ఆరోపించారు. రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా పోరాటాలు చేసి, ప్రభుత్వం మెడలు వంచైనా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సోషల్ జస్టిస్ పార్టీ తెలంగాణ ఇంచార్జి కె.వి.గౌడ్, బ్లూ ఇండియా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బొంగు ప్రసాద్ గౌడ్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల క్రిష్ణ, తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు గోర శ్యాంసుందర్ గౌడ్, అంబేద్కర్ ఆజాదీ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు కొంగర నరహరి, ఇండియా ఓబిసి జాక్ రాష్ట్ర నాయకులు అశోక్ పోశం, ఓబిసి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ అవ్వారు వేణు కుమార్, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి రాజు తదితర సంఘాల నాయకులు పాల్గొననున్నారు.