మత్తు డాక్టర్ అవినీతి ఆరోపణలపై విచారణ
మంథని
మంథని పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో మత్తు వైద్యునిగా పనిచేస్తున్న మోహన్ రావు పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ అధికారులు డాక్టర్ సౌరయ్య, డాక్టర్ రామ్మూర్తిలు విచారణ చేపట్టారు. జనవరి 12న తన భార్య ప్రసవం కొరకు మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకు వచ్చి అడ్మిట్ చేశానని, సాధారణ ప్రసవం సాధ్యం కాక ఆపరేషన్ చేయాలన్నారని, ఈ సమయంలో మత్తు డాక్టర్ మోహన్ రావు డబ్బులు డిమాండ్ చేశారని డబ్బులు చెల్లించే వరకు ఆపరేషన్ చేసేందుకు మత్తుమందు ఇవ్వలేదని మంథని పట్టణానికి చెందిన బండారు సమ్మయ్య జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన ఉన్నతాధికారులు మోహన్ రావు పై విచారణకు ఆదేశించారు. బుధవారం విచారణ అధికారులుగా డాక్టర్ శౌరయ్య, డాక్టర్ రామ్మూర్తి లు మంథని మాత శిశు సంరక్షణ కేంద్రానికి చేరుకుని విచారణ చేపట్టారు. మత్తు వైద్యుడు మోహన్ రావును మొదటగా విచారించి ఆయనతో లిఖితపూర్వకంగా జవాబు తీసుకున్నారు. అనంతరం ఫిర్యాదుదారుడు బండారు సమ్మయ్య విచారణ అధికారుల ముందు హాజరై మత్తు డాక్టర్ డబ్బులు డిమాండ్ చేశాడని తాను చెల్లించానని వివరించారు. తమ వద్దే కాదు ఈ కేంద్రానికి ప్రసవం కోసం వచ్చే ప్రతి ఒక్కరి వద్ద డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించాడు. అనంతరం ఆయన వద్ద లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. ఈ విచారణ జరుగుతున్న సమయంలో మంథని మండలం చిన్న ఓదాల గ్రామానికి చెందిన లింగాల సురేష్ అనే వ్యక్తి సైతం తన భార్య ప్రసవం సమయంలో మత్తు డాక్టర్ డబ్బులు తీసుకున్నాడని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ విచారణ నివేదికను జిల్లా ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి డాక్టర్ రమాకాంత్ కు అందజేస్తామని విచారణ అధికారులు డాక్టర్ సౌరయ్య, డాక్టర్ రామూర్తిలు తెలిపారు.