వైసీపీ హామీల సునామీయేనా
24న మ్యానిఫెస్టో విడుదల
విజయవాడ, ఏప్రిల్ 20,
వైసీపీ అధినేత జగన్ మ్యానిఫేస్టో పై ఇంకా కసరత్తులు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపును సాధించడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సు యాత్ర పూర్తయిన తర్వాత కీలకమైన
నియోజకవర్గాలలో పర్యటించేందుకు ఆయన మళ్లీ సిద్ధమవుతున్నారు. ఈ నెల 24వ తేదీన నామినేషన్ వేసిన అనంతరం తర్వాత మళ్లీ జనంలోకి వెళ్లడంపై రూట్ మ్యాప్ ను కూడా రెడీ చేస్తున్నారు. అయితే
మ్యానిఫేస్టో ను విడుదల చేయడం గురించి సుదీర్ఘంగా సీనియర్ నేతలతో చర్చిస్తున్నారు. బస్సు యాత్ర చేస్తూనే ఏ రకమైన అంశాలు మ్యానిఫేస్టోలో ఉండాలన్న దానిపై ఆయన ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు
చెబుతున్నారు ఇప్పటికే గత ఎన్నికల్లో రూపొందించిన మ్యానిఫేస్టో కేవలం పది నుంచి పదిహేను అంశాలతోనే రూపొందించారు. ఒక్క కాగితంతోనే మ్యానిఫేస్టోను రూపొందించారు. అది సూపర్ సక్సెస్ అయింది. దీంతో
పాటు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి రెండు అంశాలు మినహా అన్నింటినీ అమలు చేశామని వైసీపీ చెప్పుకుంటుంది. సంక్షేమంపై ఇచ్చిన హామీలకు క్యాలండర్ ప్రకారం ఖచ్చితంగా ఆ తేదీకి డబ్బులను
లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయడం కూడా కొంత కలసి వచ్చిందని భావిస్తున్నారు. క్లిష‌్టమైన కరోనా సమయంలోనూ లబ్దిదారులకు ఇచ్చే నగదును ఆపకుండా లక్షల సంఖ్యలో లబ్దిదారుల్లో మాత్రం జగన్ నమ్మకం
సంపాదించుకున్నారు. ఆ నమ్మకాన్నే ఇప్పుడు పునాదిగా చేసుకుని మ్యానిఫేస్టోను రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న పథకాలను కొనసాగించడమే కాకుండా వాటికి ఇచ్చే మొత్తాన్ని
పెంచే ఆలోచనలో జగన్ ఉన్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. అమ్మఒడి కింద ప్రస్తుతం ఏటా ఇచ్చే పదిహేను వేల రూపాయలను పెంచే ఆలోచనను చేస్తున్నట్లు తెలిసింది. వైఎస్సార్
రైతు భరోసా కింద ప్రస్తుతం ఏటా 13, 500 రైతులకు ఇస్తున్నారు. ఇందులో ఆరువేలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుండగా దానికి మరో 7,500 కలిపి చెల్లిస్తున్నారు. అయితే ఈమొత్తాన్ని కూడా పెంచాలన్న నిర్ణయానికి
జగన్ వచ్చినట్లు తెలిసింది. దీంతో పాటు వసతి దీవెన నిధులను కూడా పెంచే యోచనలో జగన్ ఉన్నారని తెలిసింది.. పింఛను మొత్తాన్ని ఐదు వేల రూపాయలకు పెంచుకంటూ వెళతామన్న హామీ కూడా ఇందులో
ఉంటుందన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ప్రస్తుతం మూడు వేల రూపాయలు మాత్రమే పింఛను ఇస్తున్నారు. దీనికి అదనంగా రానున్న ఐదేళ్లలో రెండు వేలకు పెంచుతామన్న హామీ ప్రధానంగా
ఉంటుందని చెబుతున్నారు. మరో కీలకమైన హామీ రైతు రుణమాఫీ. దీనిపై కూడా కసరత్తు చేస్తున్నారని తెలిసింది. రైతులకు లక్షన్నర రూపాయల వరకూ రుణాన్ని మాఫీ చేసేలా మ్యానిఫేస్టోలో హామీ రూపంలో
ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందుకు జగన్ కొంత ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే రైతులను పార్టీకి మరింత చేరువ చేసుకోవాలన్నా, రెండోసారి విజయం దక్కాలన్నా ఈ హామీ ఉండాలని కొందరు
పట్టుబడు తున్నారు. మొత్తం మీద ఉన్న పథకాలకు మొత్తాన్ని పెంచుకుంటూ కొత్త పథకాలను కూడా ప్రకటిస్తారన్న టాక్ మాత్రం పార్టీలో జోరుగా నడుస్తుంది. మరి మ్యానిఫేస్టో ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్రా
ఆసక్తి నెలకొంది.