Monday, December 23, 2024

సభ్యత్వాల రద్దు సాధ్యమేనా

- Advertisement -

సభ్యత్వాల రద్దు సాధ్యమేనా
హైదరాబాద్, ఆగస్టు 6

Is it possible to cancel subscriptions?

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇటీవల వాడీ వేడిగా జరిగాయి. ప్రతీరోజు సభలో యుద్ధ వాతావరణమే కనిపించింది. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ సభకు రాకపోయినా.. ఆ పార్టీ తరఫున కేటీఆర్, హరీశ్‌రావు అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు. ఇక అధికార పార్టీ కూడా ఆ ఇద్దరితోపాటు కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని దీటుగా వ్యవహరించింది. గత ప్రభుత్వ వైఫల్యాలను సభలోనే ఎండగట్టింది. దీంతో సభలో ప్రతీ చర్చ సందర్భంగా మాటల తూటాలు పేలాయి. ఇక చివరి రోజు ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సభలో మాట్లాడిన భాష, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీశాయి. ఇదిలా ఉంటే.. సభలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తరచూ పోడియం వద్దకు వెళ్లి అడ్డుకోవడం, నిరసన తెలుపడం అధికార పక్షానికి చికాకు తెప్పించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి సభలో కొందరు బీఆర్‌ఎస్‌ లీడర్లు సభా నిబంధనలను ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరడజను మంది సభ్యత్వాలను రద్దు చేయాలంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ కామెంట్‌ గులాబీ లీడర్లలో గుబులు పెట్టిస్తోంది. సీఎం టార్గెట్‌ చేసిన ఆ అరడను మంది ఎమ్మెల్యేలు ఎవరు.. ఎవరెవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు.. పదే పదే పోడియం వద్దకు వెళ్లి, విమర్శలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరు? అన్న చర్చ ఇటు బీఆర్‌ఎస్‌లో.. అటు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోంది. విపక్ష సభ్యులను భయపెట్టేందుకే సీఎం అలా మాట్లాడారా? లేక నిజంగానే ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తారా? అన్న ఉత్కంఠ నెలకొంది.సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లు సభ్యత్వాలను రద్దు చేయాలని స్పీకర్‌ భావిస్తే, ముందుగా సభ్యత్వ రద్దు వేటు పడేది ఎవరిపై..! ఆ ఆరుగురు ఎవరు? కసరత్తు ఏ విధంగా ఉంటుందనే చర్చ గులాబీ లీడర్లలో మొదలైంది. మరోవైపు సభ్యరత్వం రద్దు తర్వాత ఎలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు సరైన ఆధారాలు చేతికి వచ్చిన తర్వాత సమయం, సందర్భం చూసుకుని వేటు వేయాలని అధికార కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీలో (2014–18) నాటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ సభ్యత్వాలను అప్పటి స్పీకర్‌ మధుసూదన చారి రద్దు చేశారు. ఇదే విషయాన్ని ఇటీవల సీఎం రేవంత్‌ ప్రస్తావించారు. గతంలో ఉన్న సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని రూల్స్‌ను అతిక్రమించిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని సీఎం ప్రస్తుత స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు సూచించారు. గతంలో రద్దు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం కూడా ఆ అవకాశం ఉందని తెలుస్తోంది.రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతేడాది డిసెంబర్‌లో 6 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా 9 రోజులపాటు సెషన్స్‌ నడిచింది. ఈ రెండు సమావేశాల్లోనూ కొందరు బీఆర్‌ఎస్‌ సభ్యుల ప్రవర్తనపై విమర్శలున్నాయి. సభా నియమాలను ఉల్లంఘిస్తూ పదే పదే పోడియం వద్దకు వెళ్లి నిరసనలు తెలపడం, సమయం వృథా చేయడం, అరుపులు, కేకలతో సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. తాజాగా నిర్వహించిన బడ్జెట్‌ సమావేశాల్లోనూ సదరు ఎమ్మెల్యేల తీరు అదే విధంగా ఉన్నట్టు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ జాబితాలో కొత్తగా ఎన్నికైన ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు కొందరు సీనియర్‌ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే..సభలో విపక్ష ఎమ్మెల్యేల ప్రవర్తనపై పూర్తి ఆధారాలు సేకరించే పనిలో అధికార పార్టీ ఉంది. ఏయే రోజుల్లో ఎవరు ఎలా వ్యవహరించారు? ఏ విధమైన భాష వాడారు? అనే సాక్ష్యాలను సేకరిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి సభా కార్యక్రమాలు సాగుతున్నంత సేపు లైవ్‌ టెలికాస్టింగ్‌ సహజంగా ఉంటుంది. నిరసనలు, స్లోగన్స్, పోడియం ముట్టడించిన దృశ్యాలు మాత్రం లైవ్‌లోకి వెళ్లకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ పోడియం వద్దకు వచ్చే ప్రతి ఎమ్మెల్యే కదలికలనూ చిత్రీకరించేందుకు ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఆ కెమెరాల్లో రికార్డయిన విజువల్స్‌ను ప్రస్తుతం సేకరిస్తున్నట్టు తెలిసింది. సభలో ఉపయోగించిన పరుష పదాలు సైతం కెమెరాల్లో రికార్డు అయినట్టు సమాచారం. వాటన్నింటినీ సమయం, సందర్భం ప్రకారం బహిర్గతం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.కొందరు ఎమ్మెల్యేలు సభలో ప్రవర్తిస్తున్న తీరుపై బీఆర్‌ఎస్‌ పక్షం నుంచే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సభా సంప్రదాయాలను ఉల్లంఘించొద్దని పదేపదే సూచించినా కొందరు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. దూకుడుగా ప్రవర్తిస్తున్న కొత్త ఎమ్మెల్యేలను కంట్రోల్‌ చేయాల్సిన మాజీ మంత్రులు మౌనంగా ఉంటున్నారు. కొన్ని సార్లు సదరు ఎమ్మెల్యేలను ఎంకరేజ్‌ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందువల్లే కొత్త ఎమ్మెల్యేలు సభలో ఇష్టానుసారంగా వ్యవరిస్తున్నారని టాక్‌ ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్