కవిత పార్టీ పేరు టీఆర్ ఎస్సా…
హైదరాబాద్, ఏప్రిల్ 2
Is Kavitha’s party name TRS?
టీఆర్‌ఎస్… ఈ పేరుతో తెలంగాణకు ప్రత్యేకమైన అటాచ్‌మెంట్ ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ప్రత్యేక పార్టీ పెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన పోరాటాలను కథల కథలుగా చెప్పుకుంటారు తెలంగాణ ప్రజలు. లేటెస్ట్ పాలిటిక్స్‌లో చాలా పార్టీలకు టీఆర్‌ఎస్ రోల్ మోడల్. ప్రత్యేక రాష్ట్ర సాధించిన పార్టీగా టీఆర్‌ఎస్‌కు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంది. అయితే పార్టీని వేరే రాష్ట్రాల్లో విస్తరించాలనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర సమితిని, భారత రాష్ట్ర సమితిగా మార్చి సరికొత్త నినాదాన్ని అందుకున్నారు కేసీఆర్. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇప్పుడు తన కుమార్తె కవిత టీఆర్‌ఎస్ పేరుతో కొత్త పార్టీ పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. బంజారాహిల్స్‌లోని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె సమావేశం పెట్టింది ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై అయినా సరే రాజకీయంగా కూడా కొన్ని కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. తన పార్టీ గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు అందుబాటులో ఉందని, దాన్ని ఎవరైనా పెట్టుకోవచ్చని అన్నారు. తన పార్టీ ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల మేరకే నడుస్తుందని చెప్పారు. తమకు ఇతర రాష్ట్రాల సిద్ధాంతకర్తలు అవసరం లేదని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ఫ్రీ అయిందని చెప్పడం వెనుక కవిత పార్టీ పేరు అదే అయి ఉంటుందని ప్రచారం మొదలైంది. ఈ నెలాఖరున పార్టీ పేరు అజెండా ప్రకటిస్తానంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఈ పేరును వదిలేసిన బీఆర్‌ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది. ప్రజల్లో వచ్చే స్పందన ఏలా ఉంటుందనే విషయాల గురించి తెలుసుకునేందుకు మీడియా సమావేశంలో కవిత ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటారని విశ్లేషకులు అంటున్నారు.



