Sunday, December 22, 2024

ఇక కేసీఆర్ ఇన్ యాక్టివేనా

- Advertisement -

ఇక కేసీఆర్ ఇన్ యాక్టివేనా
హైదరాబాద్, ఫిబ్రవరి 12
అనుమానాలే నిజమయ్యాయి. బీఆర్ఎస్ నాయకులు, మరీ ముఖ్యంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎంత నమ్మకంగా చెప్పినా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనీసం బడ్జెట్ రోజున కూడా అసెంబ్లీకి హాజరు కాలేదు. ఆయన ముఖ్యమంత్రిగా, సభానాయకుడిగా ఉన్న సభలో విపక్ష నేతగా కూర్చునేందుకు ఇష్టపడటం లేదని ఆయన అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడంతో ఇక ఎలాంటి సందేహాలకూ తావులేకుండా రుజువైపోయింది.కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తొలి సారిగా జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాకపోవడానికీ, అసెంబ్లీలోనే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకపోవడానికీ ఆయన గాయపడి ఇంటి వద్ద చికిత్స పొందుతుండటం కారణమని బీఆర్ఎస్ అప్పట్లో సమర్ధించుకుంది. అది నిజమే కూడా. కానీ బడ్జెట్ సమావేశాలకు కూడా ఆయన గైర్హాజర్ కావడం మాత్రం కేసీఆర్ విపక్షనేతగా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి సుముఖంగా లేరనే భావించాల్సి వస్తోంది. నిన్నటి వరకూ బీఆర్ఎస్ వర్గాలు కేసీఆర్  విపక్ష నాయకుని హోదాలో తొలిసారిగా శనివారం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెప్పాయి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కూడా సభకు హాజరు కాలేదు.  బడ్జెట్ ప్రసంగానికి   ఆయన దూరంగా ఉన్నారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ, శాసన మండలి సోమవారానికి వాయిదా పడ్డాయి.  సోమవారం సభలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. ఆ రోజునైనా కేసీఆర్ సభకు హాజరౌతారా అన్న విషయంపై స్పష్టత లేదు.   అసలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆయన ఇంత వరకూ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడింది లేదు. కనీసం మీడియా ముఖంగానైనా ఓటమిని అంగీకరించి, కొత్త ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపింది లేదు. అసలు బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆయన ఎవరికీ మఖం చూపకుండా రాత్రికి రాత్రి ప్రగతి భవన్ ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు వెళ్లడమే ఆయన ఓటమిని జీర్ణించుకోలేక ముఖం చాటేశారన్న విమర్శలకు అవకాశం ఇచ్చింది. అప్పట్లోనే ఆయన ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఆ తరువా బీఆర్ఎస్ఎల్పీ నాయకుడి ఎన్నిక విషయంలో పార్టీలో తీవ్ర విభేదాలు తలెత్తడం, గెలుపొందిన ఎమ్మెల్యేలలోనే స్పష్టమైన చీలిక వచ్చే పరిస్థితి ఏర్పడటంతో అనివార్యంగా ఆయన బీఆర్ఎస్ఎల్పీ నాయకత్వ బాధ్యతలు చేపట్టారని పార్టీ వర్గాలే అంటున్నాయి.కేసీఆర్ కాకుంటే బీఆర్ఎస్ఎల్పీ నేత ఎన్నిక ఏకగ్రీవమయ్యే పరిస్థితి లేకపోవడంతోనే ఆయన అయిష్టంగానే ఆ పదవిని చేపట్టారని అంటున్నారు. అయితే తాను సభా నాయకుడిగా చక్రం తిప్పిన సభలో విపక్ష నేతగా కూర్చునేందుకు కేసీఆర్ వెనుకాడుతున్నారా అన్న చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నది. కేసీఆర్ ఇదే ఒరవడి కొనసాగిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ భారీగా నష్టపోక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజర్ కావడంపై అధికార కాంగ్రెస్ మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య వాదులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటమి తరువాత ఇంత వరకూ ప్రజలకు ముఖం చూపని కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొట్టి, వచ్చే సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ప్రజల ముందుకు ఏ విధంగా రాగలుగుతారని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్