జగన్ చేసిన తప్పే రేవంత్ చేస్తున్నారా…
హైదరాబాద్, ఏప్రిల్ 2, (వాయిస్ టుడే)
Is Revanth doing the same mistake that Jagan did...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎనుముల రేవంత్ రెడ్డి.. ఇద్దరూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే. ఒకరు ఆంధ్రప్రదేశ్ సీఎంగా పని చేయగా.. మరొకరు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి. ఇద్దరూ తమ ఇమేజ్‌తో తమ తమ పార్టీలను అధికారంలోకి తెచ్చినవారే. అయితే ఇద్దరూ భిన్న ధ్రువాల్లాంటి వారు. తాను సీఎం అయ్యాక జగన్ కనీసం ఫోన్ చేసి విష్ చేయలేదని ఆ మధ్య రేవంత్ స్వయంగా చెప్పారు. రేవంత్ గతంలో టీడీపీలో పని చేయడం.. చంద్రబాబు శిష్యుడనే ముద్ర.. తెలుగుదేశం అనుకూల మీడియా సపోర్ట్ ఉండటంతోపాటు.. జగన్, కేసీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉండటమే దీనికి కారణం కావచ్చు.ఇక ఇద్దరి మధ్య సారూప్యతల విషయానికి వస్తే.. ఇద్దరూ జగమొండిగా పేరు తెచ్చుకున్నవాళ్లే. ఎన్ని ఆటంకాలు వచ్చిన తమకు నచ్చిన పని చేసుకుంటూ ముందుకెళ్లే స్వభావం ఉన్న నేతలే వీరిద్దరూ. అదే వీరి బలం, అదే వీరి బలహీనత కూడా.తాజాగా కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ.. రేవంత్ రెడ్డి చేస్తున్న పని జగన్‌ను గుర్తుకు తెచ్చింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి.. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. మరోసారి అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలన వ్యవహారాలు చక్కబెట్టాలని జగన్ భావించారని.. అందుకే రుషికొండపై ప్యాలెసులు నిర్మించారని చెబుతుంటారు.ఈ ప్యాలెస్‌ల నిర్మాణం కోసం సముద్రపు ఒడ్డున పచ్చల హారంలా ఉండే రుషికొండకు గుండుకొట్టినట్టుగా చేశారంటూ గతంలో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. రుషికొండ ప్యాలెస్ వ్యవహారం ఎన్నికల ప్రచారంలో టీడీపీకి, కూటమికి ఓ అస్త్రంలా పనికొచ్చింది. ఈ వ్యవహారం వైసీపీని ఇరుకునపెట్టింది. విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్రలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలోనూ రేవంత్ రెడ్డి సర్కారు పట్ల జనంలో వ్యతిరేకత కనిపిస్తోంది. న్యూట్రల్‌గా ఉండేవారు సైతం సోషల్ మీడియాలో ఈ విషయమై గళం విప్పుతున్నారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ సంగతి చెప్పక్కర్లేదు. కంచ గచ్చిబౌలి ప్రభుత్వ భూమే కావచ్చు.. దానికి హెచ్‌సీయూకి సంబంధం లేని మాట నిజమే కావచ్చు. కానీ ఆ 400 ఎకరాల భూమి కాలక్రమంలో ఓ చిట్టడివిలా మారింది. ఈ చిట్టడివిలో రకరకాల చెట్లు, పక్షులు, వన్యప్రాణులు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ నీటి వనరులు కూడా ఉన్నట్లు వీడియోలను బట్టి తెలుస్తోంది. జేసీబీలు చదును చేస్తున్నప్పుడు నెమళ్లు రోదిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.