కారుకు మబ్బులు కమ్ముకున్నాయా
నిజామాబాద్, జూన్ 26,
తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది. రోజురోజుకి కారు దిగుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. ముందు ముందు ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యేలా ఉంది. కారు పార్టీపై కారు మబ్బులు కమ్మేస్తున్నా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌లో చలనం లేదు. అసలు కేసీఆర్ ఎక్కడున్నారని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల క్రితం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కారు దిగి హస్తం కండువా కప్పుకున్నారు.కేసీఆర్ కు సంజయ్ అత్యంత సన్నిహితుడని చెప్పుకుంటారు. మరి అలాంటి వ్యక్తే పార్టీ వీడితే.. మిగిలిన వారి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఆ ప్రశ్నలకు తగ్గట్టుగానే గ్రేటర్ పరిధిలో మరో ఆరుగుగు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. జులైలో జరిగే అసెంబ్లీ సమావేశాల నాటికి కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా కూడా ఉండదనే భయం ఆ పార్టీ వర్గాల్లో మొదలైంది. కేసీఆర్ ను చుట్టూ ముడుతున్నాయి.లిక్కర్ కేసులో కుమార్తె జైలుకు వెళ్లింది. సుమారు 100 రోజులు దాటుతున్నా.. ఆ విషయంలో కేసీఆర్ ఇంత వరకూ స్పందించలేదు. పార్టీ కష్టాల్లో ఉన్నపుడు కేడర్ కు అందుబాటులో ఉంటున్నారా అంటే అదీ లేదు. పార్టీని నమ్ముకున్న వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వకపోతే వారంతా పక్క చూపులు చూసే ప్రమాదం ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్లిపోతే పెద్ద ప్రమాదం ఉండదు. కానీ, క్షేత్రస్థాయి నేతలు వేరే గూటికి చేరితే.. మళ్లీ పార్టీని నిర్మాణం చేయడం చాలా కష్టం. అసలే లోకల్ బాడీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ టైంలో కేసీఆర్ అలర్ట్ అవ్వకపోతే గ్రామ స్థాయి కేడర్ మొత్తం కాంగ్రెస్ లేదా బీజేపీ గూటికి చేరడం ఖాయంగా తెలుస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్ ఇక చరిత్రలో కలిసిపోయినట్టే.బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని.. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని.. రోజుకో ప్రచారం జరుగుతున్నా కేసీఆర్ స్పందించడం లేదు. ప్రమాదం అంచున ఉన్నపుడు మౌనంగా ఉండటం వ్యూహమని కేసీఆర్ భావిస్తున్నారేమో కానీ.. అదే రేపు ప్రమాదంగా మారి పార్టీకి ఉనికి లేకుండా చేస్తుంది. అధికారంలో ఉన్నపుడు పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకపోయినా.. పదవులు, నిధులు అందుతూ ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ, అధికారం కోల్పోయినపుడు కుటుంబ పెద్దగా వారికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉంది. కానీ, వరుస ఓటముల తర్వాత ఆయన బయటకు రావడానికే ఇష్టపడటం లేదు.మధ్యలో ఓసారి పార్లమెంట్ ఎన్నికల టైంలో ప్రజల్లోకి వచ్చినా ఫలితం శూన్యమైంది. ఎన్నికల టైంలో వస్తానంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని కేసీఆర్ అర్థం చేసుకొని నిత్యం ప్రజల్లో ఉండటానికి ప్రయత్నించాలి. కేసీఆర్ కు ప్రతిపక్షం కొత్తేం కాదు.. పోరాటాలు కొత్తకాదు. కానీ, ఓ సారి అధికారానికి అలవాటు పడి ఓడిపోవడం మాత్రం తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ కు కొత్తే. అందుకే ఆ ఓటములను అంగీకరించలేకపోతున్నారు. కానీ.. గెలుపు, ఓటములను ఒకేలా తీసుకోవాలి.చంద్రబాబు అలా తీసుకొని వెంటనే ప్రజల్లోకి వెళ్తారు. తప్పులను సరిదిద్దుకుంటారు. రాజకీయాల్లో ఆయన పేరు మసకబారదు. కార్యకర్తలు చనిపోతే స్వయంగా ఆయనే శవపేటిక మోస్తారు. పార్టీలో ఆయన కూడా ఓ సామాన్య కార్యకర్తలా ఉంటారు. అందుకే.. ఓటమి తర్వాత గెలుపును చంద్రబాబు చూస్తూ ఉంటారు. జగన్, కేసీఆర్ కూడా చంద్రబాబు నుంచి ఈ విషయాన్ని నేర్చుకోవాలి. అలా అయితేనే ఆయా పార్టీలు నిలబడతాయి.
కారుకు మబ్బులు కమ్ముకున్నాయా
- Advertisement -
- Advertisement -