29.6 C
New York
Wednesday, June 19, 2024

రాష్ట్ర విభజన అభివృద్ధికా?* *అసమానతలు పెంచడానికా?

- Advertisement -

*రాష్ట్ర విభజన అభివృద్ధికా?* *అసమానతలు పెంచడానికా?*

 

హైదరాబాద్, జూన్ 1(వాయిస్ టుడే స్టేట్ ప్రతినిధి).

 

 

రాష్ట్ర విభజన జరిగి 2024 జూన్‌ 2 నాటికి పది వసంతాలు గడిచాయి.పాలకుల వైఫల్యం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతాల మధ్య ఏర్పడిన అసమాన అభివృద్ధి విధానాలు విభజన తర్వాత కూడా కొనసాగుతున్నాయి.

 

దశాబ్దాలుగా జరిగిన పోరాటాలు,ఉద్యమాలు,అమర

వీరుల త్యాగాల నెత్తుటి మరకల్ని పాలకుల తిరోగమన విధానాలు తుడిపేస్తున్నాయి.కేంద్రంలోని ఈ పదేండ్ల మోడీ పాలన రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీశాయి.

 

రాష్ట్రాల హక్కులకు గండికొట్టాయి.పెద్దనోట్ల రద్దు,జీఎస్టీ,కోవిడ్‌ లాక్‌డౌన్‌,పెట్రోల్‌,డీజిల్‌ రేట్లు , నిత్యావసరాల ధరలపై నియంత్రణ లేకపోవడం లాంటి విధానాలు సామాన్యులపై మరిన్ని భారాలు మోపాయి.ఒక రకంగా చెప్పాలంటే పేదల్ని నిరుపేదలుగా మార్చాయి.

 

ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత ఏర్పడే రెండు తెలుగు రాష్ట్రాలకు పార్లమెంటు సాక్షిగా కేంద్ర పాలకులు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు.ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హ్యాండిచ్చారు.తెలంగాణకు స్పెషల్‌ ప్యాకేజీ ప్రకటిస్తామని మొండిచేయి చూపారు.ఇక,విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా పాక్షికంగానే అమలు చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని పూర్తి కావడానికి సహకరించలేదు. రాష్ట్రాలనైతే విడదీశారు కానీ కేంద్రం చేయాల్సిన పనులు,నిర్వహించాల్సిన బాధ్యతల్ని పూర్తిగా పక్కకు నెట్టేశారు.

 

మరి ఈ పదేండ్లు ఏం చేశారంటే? వారి స్వార్థ రాజకీయాలకు మతాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకున్నారు.కార్పొరేట్లకు రాయితీలిచ్చి వారిని కుబేరులను చేశారు.అటు ఏపీ,ఇటు తెలంగాణ ప్రభుత్వాలను బెదిరించి మరీ కేంద్రం తెచ్చే అడ్డగోలు,అక్రమ చట్టాలకు మద్దతు పలికించుకున్నారు.అలా మద్దతిచ్చినా తెలుగు ప్రజలకు ప్రయోజనం లేదు కదా ఒనగూర్చింది కూడా ఏమీ లేదు.ఇదంతా చూస్తే ‘నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టు’ తెలుగు రాష్ట్రాలతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంది.

 

ఈ రెండు ప్రభుత్వాలు కూడా పోరాడి సాధించుకోకుండా కేంద్రంతో రాజీ ధోరణితోనే వెళ్లి ప్రజలకు అన్యాయం చేశాయి.పైగా రైతు వ్యతిరేక చట్టాలు,కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్స్‌,2020- నూతన విద్యా విధానం,పెద్దనోట్ల రద్దు,జమ్మూకాశ్మీర్‌ 370 ఆర్టికల్‌ రద్దు,కారుచౌకగా ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడం వంటి పలు అంశాలలో పార్లమెంటులో మద్దతు ప్రకటించాయి.ఆ పార్టీల వ్యక్తిగత స్వార్థం రాష్ట్రాల హక్కుల్ని, హామీల్ని కూడా తాకట్టు పెట్టాయి.

సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించలేదు.ఆ రంగానికి ఉపయోగపడే ఆర్థిక వనరుల్ని కూడా సమకూర్చలేదు.

 

పైగా కృష్ణా,గోదావరి నదీజలాల సమస్యను పరిష్కరించాల్సింది పోయి స్వయంగా రెండు రాష్ట్రాల మధ్య పెట్టిన నీటి యుద్ధం నేటికీ కొనసాగుతూనే ఉన్నది.విద్యుత్‌ ఉత్పత్తి,పంపిణీకి నీటిని క్రమబద్దీకరించటం,రివర్‌బోర్డు ఏర్పాటు,ద్రవ్యలోటు పూడ్చటం, ఉద్యోగుల సొంత రాష్ట్రాలకు పంపటం,ఆంధ్రాలో కలిపిన ఏడు తెలంగాణ గ్రామాల ఉమ్మడి సమస్యలు పరిష్కారమే కాలేదు.ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ,ఎన్టీపీసీలో మిగిలి వున్న మూడు వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం,రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ వంటి ముఖ్యమైన హామీలు అమలు చేయలేదు.

 

9,10 షెడ్యూల్‌లో ఉన్న 91 ప్రభుత్వరంగ సంస్థలు,కార్పొరేషన్లలో 71 సంస్థలను విభజిం చినట్లు ప్రకటించి,నేటికీ ఉమ్మడిగానే కొసాగిస్తున్నారు.రాజకీయ స్వప్రయోజనాల కోసం తెలుగు రాష్ట్రాలను ఉపయోగించుకోవడమే తప్ప ఎనిమిది కోట్ల మంది ప్రజల్ని మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు.అయితే ఈ విభజన హామీల్ని కేంద్రం అమలు చేయకపోయినా,రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యహరించడం శోచనీయం.

 

ఇక మన రాష్ట్రం విషయానికొస్తే మలివిడత ఉద్యమంలో పాల్గొన్న వారెవరూ నాటి టీ(బీ)ఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా ప్రాతినిధ్యంలోకి రాలేదు.చివరికి ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని కేసీఆర్‌ కుటుంబ కృషిగానే మలిచే ప్రయత్నం జరుగుతున్నది.దీని ఫలితమే బీఆర్‌ఎస్‌ గడిచిన పదేండ్ల పాలన ఏకచత్రాధిపత్యంగా సాగడానికి కారణమైంది.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం, దోపిడీ,పీడనకు వ్యతిరేకంగా సాగింది.

 

కానీ,తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని,స్వేచ్ఛను,ప్రశ్నించే గొంతులను అణిచివేస్తూ కేసీఆర్‌ నయా నిజాంలా వ్యవహరించింది మాత్రం వాస్తవం.నాడు పార్లమెంటులో విభజన చట్టంపై చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విభజన హామీలలో ప్రధానమైనది రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అని చెప్పారు.పోలవరం,ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి పూర్తి చేయాలన్నారు.

 

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మంత్రిగా,ఉపరాష్ట్రపతిగా ప్రధాన బాధ్యతలు చేపట్టారు.కానీ అధికారంలోకి రాకముందు తను డిమాండ్‌ చేసిన ప్రత్యేక హోదాల అమలును మాత్రం గాలికొదిలేశారు.ఏపీకి నామమాత్రపు ప్రత్యేక ప్యాకేజి పేరుతో సరిపెట్టారు.తెలంగాణకు కనీసం ప్యాకేజీ ఊసైనా ఎత్తలేదు. పార్లమెంటులో ఆయన మాటల చమత్కారాలు అధికారం కోసం చేసిన అవకాశవాదాన్ని బహిర్గతం చేశాయి.

 

రాష్ట్రం ఏర్పడక ముందు పాలకుల విధానాల వల్ల ప్రాంతాలు,ప్రజల మధ్య ఏర్పడిన ఆర్థిక,సామాజిక అంతరాలు యధావిధిగా కొనసాగుతున్నాయి.ప్రజలకు దీర్ఘకాలిక అభివృద్ధికి ఉపకరించే భూమి,ఉపాధి,నీటి వనరులు, ఉద్యోగాలు,వేతనాలు వంటి అంశాలను పట్టించుకోలేదు.ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి,విద్యా,వైద్య రంగాలను మాఫియాలకు అప్పగించి సామాన్య,మధ్యతరగతి వర్గాలకు వాటిని అందుబాటులో లేకుండా చేశారు.

 

ఉత్పత్తి వర్గాలైన కార్మికులు,కర్షకులు,వ్యవసాయ కూలీలు,ఇతర చేతి వృత్తిదారులకు ఆర్థిక స్వయం పోషకత్వాన్ని కల్పించకుండా ఆయా రంగాలను నిర్వీర్యం చేసే విధానాల్ని అమలు చేశారు.ప్రజలను ఎదిగీ,ఎదగని సంక్షేమ పథకాలకు పరిమితం చేశారు.ఈ రకమైన పరిపాలన రాష్ట్ర అభివృద్ధికి,ప్రజల జీవన ప్రమాణాలు పెరగకుండా ఆటంకంగా మారింది.

 

అంతేకాదు,ఎన్నికలు వచ్చినప్పుడు సమయానుకూలంగా సంక్షేమ పథకాల ఆశ చూపడం,అడ్డగోలుగా డబ్బులు పంచి ప్రజలను మభ్యపెట్టడం,అధికార పీఠాన్ని దక్కించుకోవడం,పొద్దున ఒక పార్టీ,రాత్రి మరోపార్టీ కండువాలు మార్చుకోవడం పాలకులకు సులభమైంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచినా ప్రజల జీవితాల్లో అభివృద్ధి భూమిక ఏర్పడలేదు. భూములు పంచుతామన్న పాలకులు ఉన్న భూములను బినామీ పేర్లతో ఆక్రమించుకొని రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లుగా మారారు.పరిశ్రమల పేరుతో కంపెనీలకు వందల ఎకరాలు అడ్డగోలుగా కట్టబెడుతున్నారు.

 

వ్యవసాయానికి ప్రోత్సాహం లేక చిన్న,మధ్యతరగతి రైతులు వ్యవసాయాన్ని వదులుకొని కార్పొరేట్‌ సంస్థల వద్ద అతి తక్కువ వేతనాలకు వాచ్‌మెన్లుగా,గార్డెన్లలో పనిచేసే కూలీలుగా మారారు.గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు ప్రధానంగా పట్టణాలకు ప్రజలు వలసలు పోతున్నారు.ఈ ప్రాంతాల్లో ఎలాంటి వసతి సౌకర్యాలు లేకపోయినా తల్లిదండ్రులు పిల్లల చదువులకు ప్రాధాన్యతనిచ్చి ఏరోజుకారోజు పూట గడిస్తే చాలనే దీనస్థితికి వచ్చారు.

 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులకు ఒక భరోసా ఉంటుందని ప్రజలు భావించారు.కానీ ఇలాంటి దుర్భర పరిస్థితుల్ని ఊహించలేదు.ఉద్యోగాలు వస్తాయని,ఉపాధి సౌకర్యాలు మెరుగుపడుతాయని,అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి అయితే స్థానికంగా ఉపాధి పొందుతామని ఆశించారు.ఆ భావనతోనే పదేండ్లు మలిదశ పోరాటంలో పాల్గొన్నారు.కానీ,వారి ఆశలు ఆడియాశలైనవి.ప్రాంతాల మధ్య,ప్రజల మధ్య తీవ్రమైన అంతరాలు పెరుగుతూనే వున్నాయి.ఇది సామాజిక దోపిడీ, వివక్షకు దారితీసింది.

 

దీని ఫలితమే బీఆర్‌ఎస్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో గద్దెదించి,ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి పట్టంగట్టారు.అధికార మార్పిడిని జీర్జించుకోలేని బీఆర్‌ఎస్‌ ప్రతి చిన్న విషయాన్ని అవకాశంగా తీసుకొని కుప్పిగంతులేయడం చూస్తున్నాము.ఆ పార్టీకి జరిగిన భంగపాటును దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజారంజక పాలన కొనసాగించడమే ఏకైక మార్గం.

రాష్ట్రంలో,దేశంలో అస్తిత్వ రాజకీయాల ప్రభావం పెరుగుతున్నది.

 

బీజేపీ మతోన్మాద ప్రమాదం,రాష్ట్ర ప్రయోజనాలను ఆశించిన ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయంగా కారగ్రెస్‌ పార్టీకి పట్టం గట్టిన పర్యవసానాన్ని గమనంలో పెట్టుకొని ముందుకు సాగాలి.ప్రజల ప్రధాన సమస్యలైన భూమి,కూలి,ఉద్యోగం,ఉపాధి, అర్హులైన వారికి సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సమర్ధవంతంగా అమలు చేయాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఏ ప్రయోజనాల కోసమైతే రాష్ట్రం ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలి.

 

అన్ని ప్రాంతాలు,వివిధ వర్గాల ప్రజల మధ్య అంతరాలు తగ్గించే విధంగా ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకోవాలి.తెలంగాణ అభివృద్ధికి తగిన సూచనలు,సలహాలతో పరిపాలన సాగించాలి.గత పాలనా వైఫల్యాల్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని అన్ని రంగాల్ని అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉందన్న సంగతి మరవకూడదు.

 

రెండు రాష్ట్రాల ప్రజలు ఆశించినట్టు ఇప్పటి నుంచైనా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌,ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలి.అందుకు కేంద్రంలో నూతనంగా గెలిచే సర్కార్‌ చిత్తశుద్ధిని ప్రదర్శించాలి.

సేకరణ: (ఏనుగుల వీరాంజనేయులు సీనియర్ జర్నలిస్ట్)

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!