కాంగ్రెస్, బీజేపి పార్టీ నేతలపై మండిపడ్డ కేటీఆర్
కామారెడ్డి నవంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదంటున్న కాంగ్రెస్, బీజేపి పార్టీ నేతలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 55 ఏళ్లు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందని నిలదీశారు. బుధవారం కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్నూర్ మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో జరిగిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.సభలో మంత్రి ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘కామారెడ్డిలో రోడ్లు, తాగునీళ్లు, సాగునీళ్ల గురించి షబ్బీర్ అలీ మాట్లాడుతున్నడు. అంతకుముందు 55 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఏం అభివృద్ధి చేసింది. కేసీఆర్ సీఎం అయినంకనే తెలంగాణలో అన్ని నియోజకవర్గాలతోపాటు కామారెడ్డి అభివృద్ధి చెందింది. రైతులకు, పేదలకు, మహిళలకు సంక్షేమ పథకాలు అందుతున్నయ్. ఇంత చేస్తున్నా ఏం అభివృద్ధి చేసిండ్రని అడిగే కాంగ్రెసోనికి, బీజేపోనికి సిగ్గుండాలె. రైతుబంధును బిచ్చం అని రేవంత్ రెడ్డి ఎగతాళి చేస్తుండు. రైతులను బిచ్చగాళ్లతో పోల్చిన రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పాలి. రైతు బంధుతో ప్రజాధనం వృథా అని ఉత్తమ్ కుమార్‌రెడ్డి అంటున్నడు. వీళ్ల మాటలు చూస్తే ఏమనిపిస్తుంది..? పుసుక్కున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు మేలు చేసే పథకాలను తీసేసినా తీసేస్తరు. అయినా తెలంగాణ కాంగ్రెసోళ్లకు చేతగాక పక్క రాష్ట్రం నుంచి డీకే శివకుమార్ అనే నాయకుడిని తెచ్చుకుంటున్నరు. బక్క పలచని కేసీఆర్‌ను ఓడించనీకి పక్క రాష్ట్రపోడు కావాల్నట. మన రాష్ట్రంలో ఎన్నికలకు డీకే శివకుమార్ ఎందుకు..? రాహుల్‌గాంధీ ఎందుకు..? ప్రధాని మోదీ ఎందుకు..? అమిత్ షా ఎందుకు..?’ అని ప్రశ్నించారు.‘నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్ వేసిన తర్వాత కామారెడ్డిలో భారీ బహరింగ సభ జరుగనుంది. ఆ సభను అందరూ కలిసికట్టుగా జయప్రదం చేయాలి. కేసీఆర్‌ను గెలిపిస్తే సిలిండర్ ధర రూ.500 అయితది. ఇప్పుడు రూ.2000 ఉన్న పెన్షన్ రూ.5000 అయితది. ఈ సంగతి నాకే కాదు మీకు కూడా తెలుసు. కాబట్టి మీరంతా ప్రజల మధ్యకు పోయి కేసీఆర్ గెలుపు కోసం కృషి చేయాలి. స్వాతిముత్యం సినిమాలో ఉద్యోగం కోసం కమల్‌హాసన్.. సోమయాజులు వెంటపడ్డట్టు మీరంతా ఓట్ల కోసం ప్రజల వెంట పడాలి. కేసీఆర్‌ను కామారెడ్డిలో భారీ మెజారిటీతో గెలిపించాలి’ అని మంత్రి పిలుపునిచ్చారు.‘మనిషి పుట్టిన దగ్గరి నుంచి చచ్చిపోయేదాకా ప్రతి ఒక్కరికీ బీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. హనుమంతుడి గుడిలేని ఊరు ఉంటుందేమోగానీ, కేసీఆర్ పథకం లేని ఇళ్లు లేదు. బీఆర్‌ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి జీవిత బీమా సౌకర్యం కల్పిస్తం. తెల్ల రేషన్ కార్డుదారులందరికీ అన్నపూర్ణ స్కీమ్ కింద సన్న బియ్యం అందజేస్తం. అర్హురాలైన ప్రతి మహిళకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద నెలకు రూ.3000 ఇస్తం’ అని మంత్రి కేటీఆర్ చెప్పారు.తెలంగాణ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కాంగ్రెసోనికి, బీజేపోనికి కర్రుకాల్చి వాతపెట్టాలి. కామారెడ్డిలో కేసీఆర్ గెలిస్తే ఇక్కడి భూముల ధరలు భారీగా పెరుగుతయ్. పరిశ్రమలు వస్తయ్. అనేక రకాల వసతులు ఏర్పడుతయ్. కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నదే నియోజకవర్గ అభివృద్ధికి. గంపన్న కోరిక మేరకే ఆయన ఇక్కడికి వస్తున్నరు. బీజేపోడు ఒకడు ఇక్కడి భూములు గుంజుకునేందుకే కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నడు అంటున్నడట. అసుంటి బేకార్‌గాళ్ల మాటలు నమ్మవద్దు. కేసీఆర్‌ను బంపర్ మెజారిటీతో గెలిపించి అలాంటోళ్లకు బుద్ధి చెప్పాలి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి’ అని మంత్రి సూచించారు.