అక్రిడేషన్ పాలసీకి ఇంత జాప్యమా?
Is there such a delay in the accreditation policy?
వెంటనే ప్రకటించి అర్హులందరికీ వెంటనే కార్డులివ్వాలి
డబ్ల్యూజేఐ జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ డిమాండ్
జర్నలిస్టుల సమస్యలపై ముఖ్యమంత్రిని కలుస్తాం
పాత చట్టాలను సవరించాలి
హైదరాబాద్:
తెలంగాణలో
జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చే విధివిధానాలను వెంటనే ప్రకటించి , అర్హులైన అందరికీ వీలైనంత త్వరగా కార్డులు ఇవ్వాలని వర్కింగ్ జర్నలిస్ఠ్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ డిమాండ్ చేశారు. అక్రిడేషన్ పాలసీని సరళీకృతం చేయాలని సూచించారు. ఏడాది నుంచి ఈ అంశాన్ని తేల్చకపోవడం సమంజసం కాదన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పటిష్ఠమైన ఇన్సూరెన్స్ , ఆసుపత్రులలో ఉచిత చికిత్స, ఆరోగ్య కార్డులు తదితర అంశాలతో పాటు తెలంగాణ పాత్రికేయుల సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసి త్వరలో వినతిపత్రం ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైళ్లు, విమానాల టికెట్లలో జర్నలిస్టులకు రాయితీ ఇవ్వాలని, టోల్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని తాము పోరాడుతున్నట్లు తెలిపారు. సెప్టెంబరులో దిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించి, ఈ అంశాలపై ప్రధాని మోదీకి విన్నవిస్తామని చెప్పారు. జర్నలిజం ప్రింట్ మీడియా నుంచి మొదలై వివిధ రూపాలకు విస్తరించినందున పాత చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ ప్రక్రియలో పాత్రికేయులకూ భాగస్వామ్యం కల్పించాలని కోరారు.
ఎమ్మెల్యేలు, మంత్రులు, గెజిటెడ్ అధికారులకు కల్పించే సౌకర్యాలను జర్నలిస్టులకు వర్తింపజేయాలన్నారు. జర్నలిస్టులు నిష్పక్షపాతంగా ఉంటేనే సమాజంలో వారిపట్ల గౌరవం పెరుగుతుందన్నారు. వారు
దేశహితం కోసమే పని చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో పాత్రికేయుల పాత్ర కీలకమని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేస్తున్నా సామాజిక అంశాల్లో జర్నలిస్టులు వెనకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో ఐక్యత లేకపోవడమే అందుకు కారణమన్నారు. ఆర్థిక భద్రత, ఉద్యోగ భద్రత తదితర అంశాల్లో వెనకబడి జర్నలిస్టులు వెనకబడి ఉన్నారని, దేశమంతా ఇదే స్థితి ఉందన్నారు. వారి పక్షాన పోరాడేందుకే
వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) ఆవిష్కరించిందన్నారు. ప్రస్తుతం
దేశంలోని 16 రాష్ట్రాల్లో పాత్రికేయుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని, దేశంలోని అన్ని రాష్ట్రాలలో తమ సభ్యులు ఉన్నారని సంజయ్ ఉపాధ్యాయ తెలిపారు. జాతీయ స్థాయిలో బీఎంఎస్ కు అనుబంధంగా పని చేస్తున్నామని, త్వరలో నేపాల్ కు కూడా విస్తరించబోతున్నట్లు వెల్లడించారు.
నేడు విద్యా సదస్సు, పాత్రికేయులకు పురస్కారాలు
జాతీయ విద్యావిధానం-2020, మీడియా పాత్ర అనే అంశంపై డబ్ల్యూజేఐ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఉస్మానియా యూనివర్సిటీలో జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్లు డబ్ల్యూజేఐ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నందనం కృపాకర్ తెలిపారు. సాయంత్రం 5 గంటలకు ఉత్తమ జర్నలిస్టులకు పురస్కార ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. జర్నలిస్ఠులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. డబ్ల్యూజేఐ రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అనిల్ దేశాయ్, సిద్ధిరెడ్డి శ్రీనివాసరెడ్డి , కార్యదర్శి క్రాంతి, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు బాలకృష్ణ పాల్గొన్నారు.