గాజా సరిహద్దు ప్రాంతాలను తిరిగి స్వాధీనం
ఇజ్రాయెల్ అక్టోబర్ 11 : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది. అక్టోబర్ 6న ప్రారంభమైన ఈ యుద్ధంలో హమాస్‌పై ఇజ్రాయెల్ క్రమంగా పైచేయి సాధిస్తోంది. వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకుంటోంది. తాజాగా గాజా సరిహద్దులోని దక్షిణ ఇజ్రాయెల్‌ను హమాస్ ఉగ్రవాదుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు ఇజ్రాయెల్ రక్షణ శాఖ తాజాగా ప్రకటించింది. అంతే కాకుండా ఆ ప్రాంతంలోని అనేక ప్రదేశాలు, రహదారులను కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు సైన్యం వెల్లడించింది.ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ గత శనివారం మెరుపు దాడికి దిగిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్ సైతం హమాస్‌పై యుద్ధం ప్రకటించింది. దీంతో దాడులు, ప్రతి దాడులతో రెండు దేశాల భూభాగాలు దద్దరిల్లుతున్నాయి. ఇరు దేశాల్లో వీధులు రక్తంతో తడిసిపోయాయి.

గత ఐదు రోజుల్లో దాదాపు 3,500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడ చూసిన గుట్టలు గుట్టలుగా పడి ఉన్న మృతదేహాలతో రెండు ప్రాంతాలు భయానకంగా మారిపోయాయి. క్షతగాత్రుల రోదనలతో యుద్ధ ప్రాంతాలు హృదయవిదారకంగా దర్శనమిస్తున్నాయి. అయినా ఇజ్రాయెల్, హమాస్ వెనక్కి తగ్గడం లేదు. హమాస్ దాడులను ఇజ్రాయెల్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ మేరకు వైమానిక దాడులను కొనసాగిస్తోంది. మరోవైపు హమాస్ మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న గాజాపై దాడులను ఉధృతం చేయడానికి సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ ఇజ్రాయెల్‌లో తన సభ్యులను సమీకరిస్తోంది. భారీ సైనిక సామగ్రితో పాటు రిజర్వ్ దళాలకు చెందిన మరింత మందిని రంగంలోకి దింపుతోంది.తమ భూభాగంలోకి చొరబడిన హమాస్ బలగాలను ఇజ్రాయెల్ సైన్యం మట్టుపెట్టే పనిలో పడింది. ఇప్పటి వరకు దాదాపు 1,500 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్టు ఇజ్రాయెల్ మంగళవారం వెల్లడించింది. తమ భూభాగంలోని వివిధ ప్రాంతాల్లో వారి మృతదేహాలను గుర్తించామని పేర్కొంది. సరిహద్దుల్లోని తమ భూభాగాన్ని తిరిగి నియంత్రణలోకి తీసుకొన్నామని తెలిపింది. మరోవైపు, గాజా వైపు నుంచి సరిహద్దులవైపు ఎవరొచ్చినా కాల్చివేయాలని తమ బలగాలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
పసిపిల్లలపై హమాస్ అమానుషం
ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు నర మేధం సృష్టిస్తున్నారు. పసిపిల్లలపై కూడా వారు కనికరం చూపించడం లేదు. కెఫర్ అజా కిబుట్జ్‌లో 40 మంది చిన్నారుల మృతదేహాలను గుర్తించినట్టు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.వాటిలో కొన్నింటికి తలలు లేవని పేర్కొన్నారు. కాగా హమాస్ దాడుల వెనుక తమ ప్రమేయం లేదని ఇరాన్ తెలిపింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ వెల్లడించారు.