అప్పులపై సమాధానం చెప్పాల్సింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే
ఉపముఖ్య మంత్రి భట్టి
హైదరాబాద్
It is former Chief Minister KCR who must answer regarding the debts: Deputy Chief Minister Bhatti.
కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల భారం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు.
ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల్లోనే గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు, వడ్డీ కలిపి రూ.2,08,681 కోట్లు చెల్లించాం. అదే సమయంలో ఉద్యోగుల జీతాలు, రైతు భరోసా, సంక్షేమ పథకాలు నిరంతరంగా అమలు చేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను స్థిరపరిచాం. అధిక వడ్డీ అప్పులను డెట్ రీస్ట్రక్చరింగ్ ద్వారా పునర్వ్యవస్థీకరించి, 2031-32 వరకు చెల్లించాల్సిన రూ.34,058 కోట్ల భారాన్ని రూ.11,915 కోట్లకు తగ్గించాం. దీంతో రాష్ట్ర ఖజానాకు రూ.22,142 కోట్ల ఆదా కలిగిందని అన్నారు.
ప్రజల డబ్బును కాపాడుతూ, బాధ్యతాయుత ఆర్థిక నిర్వహణతో తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నాం. పదేళ్ల పాలనలో రాష్ట్రంపై చేసిన అప్పులపై సమాధానం చెప్పాల్సింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే అని అన్నారు. ఎఫ్ఆర్ బీఎం రుణాలు, ప్రభుత్వ హామీతో కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, డిస్కంలు తదితర సంస్థలకు పెండింగ్లు కలిపి రాష్ట్రంపై రూ.8,21,651 కోట్ల భారం మోపింది వాస్తవం కాదా? ఈ లెక్కలన్నీ అధికారిక రికార్డుల్లో ఉన్నాయి. అసెంబ్లీలో వైట్ పేపర్ సమర్పించి ప్రజల ముందుంచాం. వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నాల కంటే ప్రజలకు నిజాలు చెప్పే బాధ్యత మాజీ ప్రభుత్వానిదే నని అయన అన్నారు.




