Sunday, September 8, 2024

ఇది సంఖ్యా బలానికి సంబంధించినది  కాదు… న్యాయం కోసం

- Advertisement -

మణిపూర్ తగలబడుతూంటే మోదీ మౌనం

కాంగ్రెస్ ఎంపీ గొగోయ్  

it-is-not-about-numerical-strength-for-justice
it-is-not-about-numerical-strength-for-justice

న్యూఢిల్లీ, ఆగస్టు 8, వాయిస్ టుడే: ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశంతో కాదని.. మణిపూర్‌కు న్యాయం చేసేందుకే అవిశ్వాస తీర్మానం పెట్టామని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్ ప్రకటించారు.  కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ మంగళవారం లోక్ సభలో ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభిచారు.  ఇది సంఖ్యా బలానికి సంబంధించినది కాదని, కేవలం మణిపూర్ రాష్ట్రానికి న్యాయం జరగడం కోసమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించాలని కోరుతూ తాను ఈ తీర్మానాన్ని ప్రతిపాదించానని తెలిపారు. ఇండియా కూటమి ఈ తీర్మానాన్ని మణిపూర్ రాష్ట్రం కోసం తీసుకొచ్చిందని, మణిపూర్ న్యాయం కోరుతోందని తెలిపారు.మణిపూర్ తగులబడుతోందంటే భారత దేశం తగులబడినట్లేనన్నారు. వివిధ వర్గాల మధ్య ఇంత తీవ్రమైన విద్వేషాన్ని మునుపెన్నడూ చూడలేదన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్‌ను ఆ పదవి నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ రాజకీయాలు మణిపూర్‌లో రెండు మణిపూర్‌లను సృష్టించాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల జాఢ్యం పెరిగిందని ఆరోపించారు. గంజాయి సాగు పెరుగుతోందన్నారు.పార్లమెంటులో మాట్లాడరాదనే మౌనవ్రతాన్ని ప్రధాని మోదీ చేపట్టారని, ఆ వ్రతాన్ని భగ్నం చేయాలనే తాము ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించామని చెప్పారు. ఇప్పటి వరకు మణిపూర్‌లో ఎందుకు పర్యటించలేదు?

దాదాపు 80 రోజుల తర్వాత మాట్లాడినపుడు కేవలం 30 సెకండ్లు మాత్రమే ఎందుకు మాట్లాడారు? మణిపూర్ ముఖ్యమంత్రిని ఆ పదవి నుంచి ఎందుకు తొలగించడం లేదు? అనే మూడు ప్రశ్నలు మోదీని అడుగుతున్నామని చెప్పారు. అస్సాంలో జాతీయ పౌరుల జాబితా  ని అమలు చేయవలసి ఉందని, ఈశాన్య రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయడం లేదని విమర్శించారు.   మణిపూర్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. వైఫల్యాలను బీజేపీ అంగీకరించవలసిన సమయం ఆసన్నమైందన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోనే ఎన్డీయే సర్కారుపై కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ చర్చ మొదలైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ చర్చ జరగుతుంది. మొత్తం 16 గంటల పాటు చర్చకు సమయాన్ని స్పీకర్‌ కేటాయించారు. లోక్‌సభలో పార్టీలకున్న సంఖ్యాబలాన్ని బట్టి ఆయా పార్టీలకు మాట్లాడే సమయాన్ని స్పీకర్‌ కేటాయించారు. సంఖ్యాబలం అధికంగా ఉన్న బీజేపీ సభ్యులకు మాట్లాడేందుకు 6 గంటల 41 నిమిషాల సమయాన్ని స్పీకర్‌ కేటాయించారు. కాంగ్రెస్‌ పార్టీకి గంటా 41 నిమిషాల సమయాన్ని కేటాయించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీలకు కూడా ఈ చర్చలో పాల్గొనే అవకాశం లభించింది. ఏపీ అధికార పార్టీ వైసీపీకి 29 నిమిషాలు బీఆర్ఎస్ పార్టీకి 12 నిమిషాల సమయాన్ని స్పీకర్‌ కేటాయించారు. చర్చ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిస్తారు.మరోవైపు అవిశ్వాస తీర్మానంపై బీజేపీ నుంచి మాట్లాడే నేతల పేర్లను ప్రకటించింది ఆ పార్టీ. ఇందులో తెలంగాణ బీజేపీ మాజీ సారథి, ఎంపీ బండి సంజయ్‌కు కూడా చోటు కల్పించారు. బీజేపీ నుంచి మాట్లాడే వారిలో నిషికాంత్ దూబే, అమిత్ షా, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, జ్యోతిరాదిత్య సింధియా, స్మృతి ఇరానీ, లాకెట్ ఛటర్జీ, బండి సంజయ్, రాజ్‌దీప్ రాయ్, రామ్ కృపాల్ యాదవ్, విజయ్ బాఘేల్, రమేష్ బిధూరి, సునితా దుగ్గల్, హీనా గావిట్, రాజ్యవర్థన్ రాథోడ్ ఉన్నారు.

ఈ చర్చలో హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవడం ద్వారా మాట్లాడనున్నారు.అంతకు ముందు.. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యుల నినాదాలు మొదలయ్యాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. కాని, విపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో సభను వెంటనే మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ నిబంధనల విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. ఈ క్రమంలో టీఎంసీ ఎంపీ డెరిక్‌ ఒబ్రెయిన్‌, సభాధ్యక్షుడు జగదీప్‌ ధన్కడ్‌ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆయనను సభ నుంచి ఈ సమావేశాలు పూర్తయ్యేంత వరకు సస్పెండ్‌ చేస్తున్నట్టు రాజ్యసభ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ సమావేశాల్లో ఇది రెండో సస్పెన్షన్‌. సమావేశాల ప్రారంభంలోనే ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను సభ సస్పెండ్ చేసింది.లోక్‌సభలో అవిశ్వాసంపై బీఆర్‌ఎస్‌ నేత నామా నాగేశ్వరరావు మాట్లాడారు. తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు. తెలంగాణ ప్రగతి, పాలనా విజయాలను పార్లమెంట్ వేదికగా చెబుతామన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇస్తున్న నిధులు చాలా తక్కువని పేర్కొన్నారు నామా నాగేశ్వరరావు. దేశంలో ప్రస్తుతం మణిపూర్‌తోపాటు అనేక సమస్యలు ఉన్నాయని, ప్రధాని మోదీ మణిపూర్‌పై మాట్లాడకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు నామా. బీఏసీ సమావేశం నుంచి తొలిసారి వాకౌట్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

కూటమి పార్టీలకు విశ్వాస పరీక్ష- మోడీ సెటైర్లు

లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఇండియాలోని పార్టీలకు విశ్వాస పరీక్షేనని ఎద్దేవా చేశారు ప్రధానమంత్రి మోదీ.

2024 జనరల్ ఎలక్షన్‌ల కంటే ముందే సెమీఫైనల్‌ చూడాలని ప్రతిపక్షాల కూటమి కోరుకుందని అభిప్రాయపడ్డారు. ఆ సెమిఫైనల్ రిజల్ట్‌ ఎలా ఉందో అందరూ చూశారని అన్నారు. బీజేపీ పార్లమెంట్ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ  ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లు,అవిశ్వాస తీర్మానంపై జరిగిన మాటల యద్ధం, జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ మోదీ ఈ కామెంట్స్ చేశారు. ఈ భేటీలో విపక్ష కూటమిపై ప్రధానమంత్రి మోదీ తీవ్ర విమర్శలు చేశారు. వాళ్లంతా ఒకరిపై ఒకరు అపనమ్మకంతో ఉన్నారని ఇదే వాళ్ల పతనానికి దారి తీస్తుందని జోస్యం చెప్పారు . అవిశ్వాస తీర్మానం సందర్భంగా మాట్లాడే వారి జాబితాను గుర్తు చేస్తూ వారంతా ఆఖరి బాల్‌కు సిక్స్ కొట్టాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు మోదీ. కూటమిలోని పార్టీలకు పరీక్ష పెట్టుకునేందుకే ఈ అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తీసుకొచ్చారని మోదీ ఎద్దేవా చేశారు. ఎవరి కూటమిలో ఉన్నారో ఎవరు లేరో ఈ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా తేల్చుకుంటారని విమర్శించారు. 2018లోనే వారిపై అవిశ్వాసం ప్రకటించామన్నారు మోదీ. కూటమిని మోదీ “ఘమండియా” అని మరోసారి పిలిచారు. హిందీలో ఘమండియా అంటే అహంకారం అని అర్థం. ఆ కూటమిలోని కొందరు నేతలు చాలా అహంకారంతో ఉన్నారని, వాళ్లంతా బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నియంత్రుత్వ పోకడలను ప్రోత్సహిస్తూ ఇండియా కూటమిలో ఉన్న వాళ్లు ఇప్పుడు సామాజిక న్యాయం కోసం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏకైనా విపక్షాలు ఇండియాగా ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఆ కూటమిపై మోదీ ఎదురు దాడి చేస్తూనే ఉన్నారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌ను కొత్తగా బ్రాండింగ్ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు.దేశాభివృద్ధికి ప్రతిపక్ష కూటమి “అడ్డంకి”గా మారిందని ఇండియా అనేది అవినీతి, వారసత్వ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రానున్న సందర్భంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక కామెంట్స్ చేశారు. ఈ భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ జేపీ నడ్డా హాజరయ్యారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్