ఢిఫెన్స్ లో జగన్… ఎదురుదాడితో పార్టీని కాపాడుకునే కొత్త ప్రయత్నం
Jagan in defense…
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంతో వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుండగా… జగన్ సర్కార్ పై విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. మేం తప్పు చేయలేదు అంటూ ప్రమాణాలు చేసినా, ఎవరూ నమ్మటం లేదు. తిరుమల ఇష్యూ తర్వాత సొంత పార్టీలోనూ వైఎస్ జగన్ సహా కీలక వ్యక్తులపై క్యాడర్ కూడా అసంతృప్తిగా ఉంది. దేవుడితో ఆటలు అవసరమా…? ఇక్కడ కూడా అవినీతి అంటే పార్టీని ఎలా వెనుకేసుకొచ్చేది… ? అంటూ సొంత పార్టీ లీడర్లు సైతం అసంతృప్తిగా ఉన్నారు. ఈ అసంతృప్తి ఇలాగే పెరుగుతుండటం… టీడీపీకి తోడు జనసేనాని దీక్షతో దూకుడుగా ఉన్న నేపథ్యంలో, పార్టీని కాపాడుకునే పనిలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కావాలనే దుష్ప్రచారం చేస్తుందని తెలిసేలా ప్రత్యక్ష కార్యచరణకు జగన్ పిలుపునిచ్చారు. తిరుమల పవిత్రతను,స్వామివారి ప్రసాదం విశిష్టతను,వెంకటేశ్వరస్వామి వైభవాన్ని,టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో శనివారంరోజున ప్రత్యేక పూజలు చేయాలని, అందులో అందరూ పాల్గొవాలంటూ జగన్ పిలుపునిచ్చారు. . పార్టీపై హిందూ వ్యతిరేక ముద్రపడుతున్న నేపథ్యంలో… అది పోగొట్టుకోవటంతో పాటు ఎదురుదాడి కోసం వైసీపీ ఈ పిలుపునిచ్చినట్లు స్పష్టంగా కనపడుతోంది