
జగనన్న విదేశీ విద్యా దీవెన
నిధులు జమ చేసిన సీఎం జగన్
తాడేపల్లి: పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతరులకు రూ. కోటి వరకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుంది. ఈ విడతలో అర్హులైన 357 మంది విద్యార్థులు రూ.45.53 కోట్లు అందుకోనున్నారు. ప్రతి ఏడాది 2 సీజన్లలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన వారికి లబ్ధి చేకూరుస్తున్నారు. సంబంధిత శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ ద్వారా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా నగదును నేరుగా లబ్ధిదారులైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు..




