జానారెడ్డికి కీలక పదవి..
నల్గోండ, మార్చి 7, (వాయిస్ టుడే )
Jana Reddy gets a key position..
పెద్దలు జానారెడ్డికి.. ప్రభుత్వంలో పెద్ద పదవి దక్కబోతుందా అంటే.. అవుననే సమాధానమే అన్నిచోట్లా వస్తోంది. దీనికి జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ కావడమే కారణంగా చూపిస్తున్నాయ్ గాంధీభవన్ వర్గాలు. కేబినెట్‌లోని కొందరు తన మాట వినడం లేదని.. సహకారం లేదని.. బహిరంగంగానే కామెంట్ చేసిన రేవంత్.. పార్టీలో, ప్రభుత్వంలో తనకో పెద్ద దిక్కు కావాలని అనుకుంటున్నారా.. అందుకే పెద్దలు జానారెడ్డిని వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తున్నారా… ఇదే నిజమైతే ఒకే కుటుంబానికి మూడు పదవులు అంటే.. కొత్త సమస్యలు తప్పవా.. ఇప్పుడిదే కాంగ్రెస్ నేతల్లో కాకరేపుతోంది..రేవంత్ ఢిల్లీ టూర్‌కు రెడీ అవుతున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు కీలక పదవులకు సంబంధించి.. హైకమాండ్‌తో చర్చలు జరిపే చాన్స్ ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్ వెళ్లడం కొత్త ప్రాధాన్యత సంతరించుకుంది. జానారెడ్డితో ఆంతరంగికంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.కేబినెట్ విస్తరణతో పాటు.. పార్టీలో కీలక పదవుల అప్పగింతల వేళ.. జానారెడ్డితో రేవంత్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఐతే ఇక్కడే అసలు ట్విస్ట్ కనిపిస్తోంది. సలహాల కోసమే కాదు.. సర్‌ప్రైజ్ ప్లాన్ చేసి మరీ జానారెడ్డి ఇంటికి రేవంత్ వెళ్లారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఈ ప్రచారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది.ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా జానారెడ్డిని నియమించాలని రేవంత్ నిర్ణయించారని.. దీని గురించి ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఐతే త్వరలో దీనికి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా నడుస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా.. ప్రభుత్వంతో జానారెడ్డిని భాగం చేయడం వెనక రేవంత్ భారీ స్కెచ్ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.పార్టీ మాత్రమే కాదు.. ప్రభుత్వంలోని కొందరు మంత్రుల నుంచే తనకు సహకారం లభించడం లేదని.. ఈ మధ్య పీసీసీ సర్వసభ్య సమావేశంలో రేవంత్ బహిరంగంగానే కామెంట్లు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు నిలుపుకోవాలంటే.. ఓ పెద్ద సపోర్టు కావాలి.. ఓ పెద్దమనిషి అండ కావాలి. అందుకే పెద్దలు జానారెడ్డికి పెద్దపదవి కట్టబెట్టేందుకు రేవంత్ రెడీ అయ్యారనే చర్చ నడుస్తోంది.జానారెడ్డిలాంటి పెద్దలు తనతో ఉంటే, తన పక్కన ఉంటే.. మరింత బలం లభించే అవకాశాలు ఉన్నాయన్నది రేవంత్ ప్లాన్ అనేది మరికొందరి అభిప్రాయం. నిజానికి పార్టీలో మిగతా సీనియర్లతో పలు సందర్భాల్లో రేవంత్‌కు గ్యాప్ ఏర్పడ్డా .. జానారెడ్డితో మాత్రం మొదటి నుంచి బంధం బలంగానే ఉంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకంలోనూ జానారెడ్డి పాత్ర కీలకం అనే చర్చ కూడా జరిగింది.రేవంత్‌కు పదవి ఇప్పించేందుకు అధిష్టానంతో జానారెడ్డి స్వయంగా మాట్లాడారనే టాక్ కూడా అప్పట్లో విన్పించింది. ! ఐతే ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పరిస్థితుల మధ్య.. పెద్దలు జానారెడ్డి సపోర్టు రేవంత్‌కు చాలా అవసరం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అందుకే ఆయనను ప్రభుత్వంలో చేర్చి.. తన బలం పెంచుకోవాలన్నది రేవంత్ వ్యూహమనే టాక్ కూడా అప్పుడే మొదలైంది.పెద్దలు జానారెడ్డికి.. పెద్ద పదవి సంగతి ఎలా ఉన్నా.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పెట్టుకున్న నిబంధనల సంగతి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. ఒక కుటుంబానికి ఒకే పదవి అనే నిబంధన పెట్టుకున్నారు. ఐతే ఇప్పుడు జానారెడ్డికి ప్రభుత్వంలో పదవి అప్పగిస్తే.. ఆయన కుటుంబంలో ముగ్గురికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఇప్పటికే ఆయన కుమారుల్లో ఒకరు ఎమ్మెల్యేగా ఉండగా.. మరొకరు ఎంపీగా కొనసాగుతున్నారు.జానారెడ్డికి పదవి అప్పగించాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నా.. పార్టీపరంగా ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనే చర్చ కూడా జరుగుతోంది. ఐతే ఒక కుటుంబానికి ఒకే నిబంధన అనే నిబంధన పెట్టుకున్నా.. తెలంగాణలో అది పెద్దగా వర్కౌట్ కాలేదు. వివేక్ వెంకటస్వామి కుటుంబం నుండి ఇప్పటికే మూడు పదవులు ఉండగా…వివేక్ కేబినెట్ రేసులోనూ ఉన్నారనే టాక్ ఉంది. ఇక ఉత్తమ్ కుటుంబానికి రెండు.. కోమటిరెడ్డి ఫ్యామిలీకి రెండు.. కేకే కుటుంబం నుంచి ఇద్దరు పదవుల్లో ఉన్నారు. మరి ఇప్పుడు జానారెడ్డికి లైన్ క్లియర్ అవుతుందా.. ఆయన విషయంలో రేవంత్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా…బెడిసి కొడుతుందా అన్నది చూడాలి మరి