సి ఐ టీ యూ – రైతు సంఘం
డోన్: కార్మిక-కర్షక మరియు ప్రజా సమస్యల పరిష్కారానికై ఈనెల 27,28 న విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో జరుగు మహాధర్నాను కార్మికులు,కర్షకులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి టి.శివరాం,రైతు సంఘం మండల అధ్యక్షులు బి.నాగ మద్దయ్య పిలుపునిచ్చారు. స్థానిక కొండపేటలోని మోటార్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో మహా ధర్నాకు సంబంధించిన కరపత్రాలను సీనియర్ నాయకులు జి.కొండయ్య, రైతు సంఘం గౌరవాధ్యక్షులు కోయిలకొండ నాగరాజు,సిఐటియు మండల, పట్టణ అధ్యక్షులు ఏవి.భాస్కర్ రెడ్డి,నక్కిశ్రీకాంత్ లతో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు ఊడిగం చేసే విధానాలతో ప్రజల సంపదను వారికి కట్టబెట్టడంలో పోటీలు పడుతున్నాయన్నారు.ప్రజలపై అన్ని రకాలుగా భారాలు మోపుతూ వారి నడ్డి విరుస్తున్నాయని ఎద్దేవా చేశారు.కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ వారి హక్కులు హరించి వేస్తూ యజమానులకు అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్ లను తేవడం కార్మికులను బానిసలుగా మార్చడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.కనుక లేబర్ కోడ్ లను రద్దుచేసి కార్మిక హక్కులను పునరుద్ధరించాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలఅన్నారు. ప్రభుత్వ విధానాలతో పేదరికం,నిరుద్యోగం,దారిద్యం,ఆకలి కేకలు అధికమయ్యాయి అన్నారు,ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్,డీజిల్ ధరలతో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి సామాన్యుల బ్రతుకు భారంగా మారిందన్నారు, మరోవైపు అసలే సంక్షోభంలో ఉన్న రవాణా రంగం మరింత సంక్షోభంలోకి కురుకుపోయిందని ఈ రంగంపై ప్రత్యక్షంగా ఆధారపడిన లారీ డ్రైవర్లు,ఆటో డ్రైవర్లు పరోక్షంగా ఆధారపడిన లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు దాపురించాయని కావున పెట్రోల్ డీజిల్ పై జి యస్ టీ విధానం అమలు చేయాలని,ప్రభుత్వ పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు,ఆహార భద్రతకు భరోసా ఇవ్వాలని,కోవిడ్ సాకు తో సీనియర్ సిటిజన్స్ మహిళలు,వికలాంగులు,
క్రీడాకారులకు ఉపసంహరించిన రైల్వే రాయితీలను పునరుద్ధరించాలన్నారు.రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించి వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతు ఆత్మహత్యలను ఆపాలన్నారు.రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నదని కరువు కొంచెమే ఉన్నదని చెప్పడానికి పాలకులు సిగ్గుపడాలని దిక్కుతోచని పరిస్థితులలో రైతులు పేదలు, కూలీలు ఊళ్లకు ఊళ్లే పట్టణాలకు వలస బాట పడుతున్నారని ఉపాధి అవకాశాలు కల్పించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించే ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా విజయవాడలో రెండు రోజుల పాటు జరిగే మహా ధర్నాలో కార్మికులు,రైతులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.


