రేవంత్ పై జీవన్ రెడ్డి అలక
హైదరాబాద్, జూన్ 25,
తెలంగాణ కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక అసంతృప్తి రాజేస్తోంది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లూ ఎవరి మీద కొట్లాడానో వారినే తనకు మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి కాంగ్రెస్ కార్యకర్తలు మనస్తాపానికి గురై బాధ పడుతున్నారు. ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. 40 ఏళ్ల నా సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా.? ఇంకా నాకు ఈ పార్టీ ఎందుకు? ఈ ఎమ్మెల్సీ పదవి ఎందుకు..?. శాసన సభలో సంఖ్యా బలం పెంచుకోవడం కోసం ఏకపక్షంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాం అని చెప్తున్నారు.. కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదు.’ అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆయనపై తిరుగుబావుటా ఎగురవేసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్లు జీవన్ రెడ్డి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.అయితే, తనకు ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన లేదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నానని.. అనంతరం పల్లెలన్నీ తిరుగుతూ ప్రజలతో మమేకమవుతానని అన్నారు. ఇన్నేళ్లు పార్టీ నిర్ణయాలన్నింటినీ గౌరవించానని.. అయితే ఈరోజు నాకు గౌరవం దక్కలేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలతో సంప్రదించి వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అటు, తనను బీజేపీ నుంచి ఎవరూ సంప్రదించలేదని చెప్పారుకాగా, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ చేరారు. సీఎం రేవంత్ రెడ్డి వీరికి స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, సంజయ్ కుమార్ చేరికపై సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను కనీసం సంప్రదించకుండా.. ఎలాంటి సమాచారం లేకుండానే అలా చేర్చుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జగిత్యాల నుంచి కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నేత జీవన్ రెడ్డి. 1983 నుంచి రాజకీయాల్లో ఉన్న ఆయన.. మొదట టీడీపీ నుంచి గెలిచి తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి జగిత్యాల నుంచి ఆయన బరిలో నిలవగా.. కాంగ్రెస్ తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమైన తర్వాత వరుసగా మూడుసార్లు ఓటమి పాలయ్యారు. గత రెండుసార్లు ఆయనపై డాక్టర్ సంజయ్ కుమార్ గెలిచి.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరారు. ఇదే జీవన్ రెడ్డి అసంతృప్తికి కారణమైంది.సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే తన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని జీవన్ రెడ్డి భావిస్తున్నారు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని.. ఇప్పుడు ఇలా జరిగితే తన గౌరవం దెబ్బతింటుందని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయన నివాసానికి సోమవారం వెళ్లారు. ఆయనతో మాట్లాడారు. జీవన్ రెడ్డికి చెప్పేంత గొప్పవారం కాదని.. ఆయన అంసతృప్తిని అధిష్టానానికి తెలియజేస్తామని మంత్రి తెలిపారు. అయితే, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఇది సరికాదని జీవన్ రెడ్డి తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది.
రేవంత్ పై జీవన్ రెడ్డి అలక
- Advertisement -
- Advertisement -