- Advertisement -
పోలీసుల అదుపులో జానీ మాస్టర్
Johnny Master in police custody
హైదరాబాద్, సెప్టెంబర్ 19, (వాయిస్ టుడే)
పరారీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు ఆయన్ను బెంగుళూరు ఎయిర్ పోర్ట్ సమీపంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నారు. నేరుగా హైదరాబాద్‌లోని ఉప్పర్‌పల్లి కోర్టులో ఆయన్ను హాజరుపరిచే అవకాశం ఉంది. కాగా, తనను జానీ మాస్టర్ పలుమార్లు లైంగికంగా వేధించాడని ఆయన దగ్గర పని చేసే మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదు చేశారు. బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పీఎస్‌కు బదిలీ చేశారు. జానీపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి పరారీలో ఉన్న అతన్ని తాజాగా అరెస్ట్ చేశారు.మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ అమ్మాయి 2017లో ఓ డాన్స్ షోలో పాల్గొనగా.. ఆ షోకి జడ్జిగా జానీ మాస్టర్ ఉన్నారు. ఆమె ప్రతిభ చూసి ఆమెకు సినిమాల్లో తన వద్ద డ్యాన్స్ అసిస్టెంట్‌గా అవకాశం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అలా 2019 నుంచి ఆ యువతి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తోంది. తాను మైనర్‌గా ఉన్న సమయంలోనే హోటల్‌లో తనపై జానీ అత్యాచారం చేశారని యువతి ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు పోక్సో యాక్ట్‌ను సైతం జత చేశారు. ‘2019 నుంచి జానీ మాస్టర్ బృందంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరాను. ముంబయిలో ఓ సినిమా షూటింగ్ నిమిత్తం నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్‌లో జానీ మాస్టర్ నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ సమయంలోనూ క్యారవాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆ వేధింపులు భరించలేకే బయటకు వచ్చేశాను. అయినా ఇతర ప్రాజెక్టులు రాకుండా నన్ను ఇబ్బంది పెట్టాడు.’ అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విచారణ జరుపుతోంది. అటు, జానీపై ఈ స్థాయి ఆరోపణలు రావడంతో కొరియోగ్రాఫర్ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. జనసేన స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న జానీ మాస్టర్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, బాధితురాలికి జరిగిన అన్యాయం పట్ల నటి అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిలు, మహిళలు తమకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే బయటకు చెప్పాలని.. మహిళలకు సానుభూతి అవసరం లేదని అన్నారు. ‘పుష్ప’ సెట్స్‌లో రెండు, మూడుసార్లు ఆ అమ్మాయిని చూశానని.. తన ఇబ్బందులు బయటకు తెలియకుండా దాచిపెట్టిందని చెప్పారు. మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి అని ఇలాంటి పరిస్థితులు ఆ అమ్మాయి టాలెంట్‌ను ఏమాత్రం తగ్గించలేవని అన్నారు.
- Advertisement -