ఒక్క ఛాన్స్ ప్లీజ్..!
మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో అభివ్రుద్ధి అంటే ఏంటో చూపిస్తా
:
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
Just one chance please..! Union Minister Bandi Sanjay Kumar
హైదరాబాద్
రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో అభివ్రుద్ధి అంటే ఏంటో చూపిస్తాం. అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గెలిపిస్తే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని ఒప్పించి కేంద్రం నుండి అధిక నిధులు తీసుకొస్తాం. అవసరమైతే సీఎస్సార్ నిధులు తెచ్చి బీజేపీ పాలిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివ్రుద్ధి చేస్తాం. అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు విజ్ఝప్తి చేశారు. కేంద్రం నుండి వస్తున్న నిధులతోనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అంతో ఇంతో అభివ్రుద్ధి జరుగుతోందన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నయాపైసా కూడా పట్టణ స్థానిక సంస్థల్లో ఖర్చు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే రెండేళ్ల పాలనలో మున్సిపాలిటీలకు ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి,అని సవాల్ విసిరారు. సికింద్రాబాద్ లోని క్లాసిక్ గార్డెన్ లో జరిగిన ‘బీజేపీ మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనం’లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
కాంగ్రెస్ పార్టీ ‘జై శ్రీరాం’ అంటే కూడా భయపడుతోంది. జై శ్రీరాం బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. చెక్ చేసుకోవాలని ఎంపీ అరవింద్ అంటే గాంధీ భవన్ లో బీజేపీ సభ్యత్వాలపై ఆరా తీస్తున్నారట. ప్రజలంతా బీజేపీ కార్యకర్తలు, నాయకులను చూడగానే ‘జై శ్రీరాం’ అని అంటున్నారు. శ్రీరాం వారసులు బీజేపీ వాళ్లేనని జనమే గుర్తించారు.
ఫిబ్రవరి 15లోపు ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈనెల 28లోపు షెడ్యూల్ వెలువడే అవకాశముందని చర్చ జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు లక్కీ హ్యాండ్. రాష్ట్రమంతా బీజేపీకి మంచి వాతావరణం ఉంది. గతంకంటే అధిక పంచాయతీ స్థానాలను గెలుచుకున్నాం. అర్బన్ లో బీజేపీకి పూర్తి అనుకూలంగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటాం. ఆయన ఆధ్వర్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామేమో.
క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నుండి ఎవరు గెలిచినా మళ్లీ కాంగ్రెస్ లోకి వెళతారు. ఆ పార్టీ నుండి పోటీ చేయడానికి ఆసక్తి కూడా చూపడం లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉండబోతుంది.
కరీంనగర్, నిజామాబాద్, బైంసా, నిర్మల్ వంటి ప్రాంతాల్లో బీజేపీ గెలుస్తుందనే సర్వేలు చెబుతున్నాయి. కానీ డీలిమిటేషన్ పేరుతో ఓట్లను తారుమారు చేసి ఎంఐఎంకు ఎక్కువ సీట్లు వచ్చేలా కాంగ్రెస్ కుట్ర చేసింది. మజ్లిస్ పార్టీలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గం కాంగ్రెస్ తో, ఇంకో వర్గం బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ కు 10, 12 సీట్లు వచ్చినా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ సహకారంతో మేయర్ సీటును కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి. అదే సమయంలో ఆ పార్టీలకు డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో అభివ్రుద్ధి, ప్రజా సమస్యలు, హిందుత్వ అంశాలే బీజేపీ ప్రధాన ఎజెండా. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2014కు ముందు, ఆ తరువాత జరిగిన అభివ్రుద్ధి గురించి బేరీజు వేయాలని ప్రజలను కోరదాం. మున్సిపాలిటీల్లో అంతో ఇంతో అభివ్రుద్ధి జరుగుతోందంటే కేంద్ర నిధులవల్లే. స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, అమ్రుత్ పథకాల పేరుతో వేల కోట్ల నిధులిస్తోంది. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరదాం. అప్పుడు ప్రజల్లో బీజేపీకి ఎందుకు అవకాశం ఇవ్వాలనే అంశంపై చర్చ జరుగుతుంది. బీజీపీని అత్యధిక మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను అప్పగిస్తే… కిషన్ రెడ్డి, రామచంద్రరావు, నేను ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి ఒప్పించి ఆయా మున్సిపాలిటీలకు అధిక నిధులు తెస్తాం. అభివ్రుద్ధి అంటే ఏమిటో చూపిస్తాం. అవసరమైతే సీఎస్సార్ నిధులు తెచ్చి అభివ్రుద్ధి చేస్తాం. అభివ్రుద్ధి పేరుతో బీజేపీ ప్రజల్లోకి వెళుతుంటే… మజ్లిస్ తో కలిసి కాంగ్రెస్, బీఆర్ఎస్ మతం పేరుతో ఎన్నికల్లో వెళ్లాలని చూస్తున్నాయి.


