మహిళల కోసం పోరాడిన జ్యోతిరావు ఫూలే
హైదరాబాద్, ఏప్రిల్ 11
Jyotirao Phule, who fought for women
మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అనుసరించిన మార్గం అందరికీ ఆచరణీయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.) ఫూలే 198వ జయంతి సందర్భంగా జ్యోతిరావు పూలే చేసిన త్యాగాలను, సమాజానికి చేసిన సేవల గురించి సీఎం స్మరించుకున్నారు.ఓ సామాన్యుడిగా మొదలై ఒక సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఫూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావితరాలకు సైతం మార్గదర్శకుడని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడని ఆయన కొనియాడారు. వెనుకబడిన వర్గాలు, దళిత జనోద్ధరణకు ఆయన ఎంచుకున్న బాట, అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్సును కాంక్షించే వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఆయన ఓ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. మహాత్మా జ్యోతిబా ఫూలే స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టిందన్నారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిభా పూలే పేరు పెట్టి ప్రజా భవన్ గా మార్చడం జరిగిందన్నారు. పూలే స్పూర్తితోనే విద్య, ఉపాధి అవకాశాలు అన్ని వర్గాల వారికి అందించాలనే లక్ష్యంతోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టడం జరిగిందన్నారు. దేశంలోనే తొలి సారిగా బీసీ కుల గణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించడం జరిగిందన్నారు. అంతే గాకుండా మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. మహిళా శక్తి పాలసీ ద్వారా డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు, వారి పేరిట పెట్రోల్ బంకుల ఏర్పాటు, సోలార్ పవర్ ప్లాంట్ల కేటాయింపు, ఆర్టీసీకి అద్దె బస్సులు ఇలా ప్రతి రంగంలో మహిళలను ప్రోత్సాహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తుందన్నారు.ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అయిదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాలను ఇప్పటికే అమలు చేసిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పట్టాలు కూడా మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతుందన్నారు.