హైదరాబాద్, అక్టోబరు 5: మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 94వ జయంతి వేడుకలు నేడు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఉన్న కాకా విగ్రహానికి రాష్ట్ర బీజేపీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాకా జయంతి వేడుకల కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ‘వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి భారతీయ జనతా పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉన్న వ్యక్తి వెంకటస్వామి గారు. అనేక కార్మిక ఉద్యమాలలో ఆయన ప్రత్యక్షంగా పోరాటం చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వెలుగులు నింపిన వ్యక్తి కాకా’ అని అన్నారు.‘హైదరాబాద్‌లోని వందలాది బస్తీలతో గడ్డం వెంకటస్వామి జీవితం పెనవేసుకుంది. పేద ప్రజలకు ఇండ్ల కోసం స్థల సౌకర్యం కల్పించిన మహనీయుడు. ఆంధ్రప్రదేశ్‌లో కార్మికుల పక్షాన అనేక ఉద్యమాలు నిర్వహించి లక్షలాది మంది కార్మికుల జీవితాలకు బాటలు వేశారు. దేశంలోనే అత్యున్నత స్థానంలో సేవలు అందించిన వెంకటస్వామి గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్దాం’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.