Tuesday, April 22, 2025

కాలభైరవ స్వరూపం

- Advertisement -

కాలభైరవ స్వరూపం

Kalabhairava form

ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో బ్రహ్మమెవరని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోదాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి. ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ ‘అదేమిటి? బ్రహ్మమెవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును’ అన్నాడు. బ్రహ్మగారు ‘నేనే ఈ లోకములన్నిటిని సృష్టించాను నేనే నిక్కపు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను. నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. నాకన్నా బ్రహ్మమెవరు? నేనే బ్రహ్మమును’ అన్నాడు. పక్కనున్న విష్ణువు ‘బ్రహ్మా! నా అంతవాడిని నేను అంటున్నావు. నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా! బ్రహ్మమును నేను’ అన్నారు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదములని పిలుద్దాం అని వేదములను పిలిచారు. ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం చేస్తే మొట్టమొదట నారాయణుడు జన్మించాడో ఎవరు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది. యజుర్వేదమును పిలిచారు. ఆసురీశక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది తరువాత సామవేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతు తనలో తాను రమిస్తూ ఉన్న శివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదములు అదే చెప్తున్నాయి. ప్రణవాన్ని పిలిచారు. ప్రణవం ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై, శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము’ అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈమాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారింది. జ్యోతి సాకారం అయింది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. బ్రహ్మ నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి’ అన్నాడు.
బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. ఇపుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. ‘ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపమును అడిగాడు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. అయిదవ తలను గిల్లెయ్యి’ అంది. ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై అయిదవతలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ నాలుగు తలకాయలు పట్టుకు వెళ్లి అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వరా! నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. శంకరుడు కాల భైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. నిన్ను ఇవాళ్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది. పుట్టేప్పటికే నీ స్వరూపమును చూసేటప్పటికీ లోకం అంతా గజగజలాడిపోయింది. నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు. ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని ‘భైరవ యాతన’ అంటారు. జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసెయ్యి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు.
ఇకనుంచి నీవు నా దేవాలయములలో క్షేత్ర పాలకుడవయి ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేసెయ్యి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు ‘పాప భక్షకుడు’ అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు’ అని చెప్పాడు. …

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్