ఒంటరి పోరుకే కమలం ఆసక్తి
విజయవాడ, మార్చి 5
: ఏపీ విషయంలో బిజెపి అంతరంగం అంతుపట్టడం లేదు. ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకవైపు పొత్తుకు సానుకూల సంకేతాలు పంపుతూనే.. మరోవైపు 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజెపి ఉంది. ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థుల చొప్పున స్క్రీనింగ్ చేసి హై కమాండ్ కు పంపడం విశేషం. దీంతో అసలు ఏపీలో పొత్తు ఉంటుందా? లేదా? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అభ్యర్థులను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ.. ఏపీలో మాత్రం ఒక్క పార్లమెంట్ స్థానానికైనా అభ్యర్థిని ప్రకటించలేదు.సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో జాతీయస్థాయిలో అందరి దృష్టి రాష్ట్రంపై పడింది. ఈ తరుణంలో ఏపీ ఫై బిజెపి ప్రత్యేకంగా దృష్టి సారించాలి. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ పరిస్థితి ఉంది. కనీసం కాంగ్రెస్ పార్టీ చూపెడుతున్న దూకుడు కూడా బిజెపిలో లేదు. అసలు పొత్తుల విషయంపై స్పందన లేదు. రాష్ట్ర నాయకత్వం మాత్రం ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన పై ప్రత్యేక సమావేశం నిర్వహించింది. బిజెపి జాతీయ నాయకుడు శివప్రకాష్ తో పాటు మరికొందరు ముఖ్యులతో అభ్యర్థుల స్క్రీనింగ్ నిర్వహించారు. ఒక్కో జిల్లాకు 45 నిమిషాల నుంచి గంట పాటు సాగింది ఈ సమావేశం. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ స్థానానికి ముగ్గురు, పార్లమెంట్ సీటుకు ఇద్దరి చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 525 మందికి పైగా అభ్యర్థులను ఖరారు చేస్తూ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి హై కమాండ్ కు నివేదిక పంపారు. అక్కడ మరోసారి స్క్రీనింగ్ జరిగిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. దీంతో పొత్తులపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.మరోవైపు బిజెపి కోసం చంద్రబాబుతో పాటు పవన్ ఎదురుచూస్తున్నారు. అటు బిజెపి చర్యలను చూసి పొత్తు ఉంటుందా లేదా అన్న టెన్షన్ కొనసాగుతోంది. ఈనెల 6న బిజెపి కీలక సమావేశం జరగనుంది. ఆ సమయంలోనే పొత్తులపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బిజెపి అడుగులు చూస్తుంటే పొత్తు లేదని అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. కానీ టిడిపి నేతలు మాత్రం పొత్తు ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు పవన్ సైతం అదే లెక్కతో ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో పొత్తుపై స్పష్టత వస్తుందని నమ్మకం పెట్టుకున్నారు. ఒకవేళ బిజెపి రాకుంటే ప్రత్యామ్నాయం పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది
ఒంటరి పోరుకే కమలం ఆసక్తి
- Advertisement -
- Advertisement -