- Advertisement -
హ్యాట్రిక్ పై కమలం గురి
Kamalam scored a hattrick
ఛండీఘడ్, సెప్టెంబర్ 17, (వాయిస్ టుడే)
హర్యానాలో ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేసి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అగ్రనేతలు కూడా హర్యానాలో పర్యటిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మ్యానిఫేస్టో బలంగా జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ప్రధానంగా హర్యానాలో ఈసారి కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొని ఉందని చెప్పకతప్పదు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా అధికారంలోకి వచ్చేటంత సీట్లు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొంటుంది. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి కానుంది. హ్యాట్రిక్ విజయం కోసం… వచ్చే నెల 1వ తేదీన హర్యానా శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి. అక్టోబరు 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. వరసగా రెండు విడతలుగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి హ్యాట్రిక్ విజయం సాధించాలని కోరుకుంటుంది. అందుకోసం ప్రజలను ఆకట్టుకునే విధంగా మ్యానిఫేస్టోను రూపొందించింది. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతూ ప్రజల్లోకి చొచ్చుకెళుతుంది. అదే సమయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం తమకు అధికారాన్ని అప్పగిస్తే నాయబ్ సింగ్ సైనీని మరోసారి ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. ఇలా బీజేపీ అనేక వ్యూహాలతో హర్యానా ఎన్నికలకు వెళుతుంది. కాంగ్రెస్ నమ్మకం ఇదే… కాంగ్రెస్ కూడా హర్యానా ఎన్నికలపై గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈసారి కేంద్ర ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత తమ విజయానికి కారణమవుతుందని గట్టిగా కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుంది. సీనియర్ నేతలను పరిశీలకులుగా దింపడమే కాకుండా అగ్రశ్రేణి నేతలు తమ పార్టీ తరుపున ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పదేళ్ల కమలనాధుల పాలన నుంచి ప్రజలు విముక్తి కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పడమే మార్గమమని ప్రధానంగా ప్రచారంలో పేర్కొంటుంది. ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెబుతుంది. ప్రధానంగా రైతులను కేంద్రప్రభుత్వం మభ్యపెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈసారి వారు తమ వైపు మొగ్గు చూపుతారని విశ్వసిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున కూడా అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ
కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాగా వినిపిస్తుంది. మరి ఎవరిది గెలుపు అన్నది మాత్రం అక్టోబరు 4వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే.
హోరా హోరి ప్రచారంలో పార్టీలు
హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంఇ. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో ప్రచారంలో అన్నిపార్టీలు నిమగ్నమయ్యాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టోను ప్రకటించింది. ఇక ఇప్పటికే అధికారంలో ఉన్న హర్యానాను నిలబెట్టుకునేందుకు యత్నిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల జోష్‌తో ఇటు హర్యానాలో, అటు జమ్మూ కశ్మీర్‌లో పాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే హరియానా ఎన్నికల కోసం ప్రత్యేకంగా ముగ్గురు సీనియర్ నేతలను పరిశీలకులుగా నియమించిందిహర్యానా అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా ఏఐసీసీ నియమించిన వారిలో రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నాయకులు అజయ్ మాకెన్, పర్తాప్ సింగ్ బజ్వాలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. హరియానాలో ఆప్‌తో పొత్తు కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో 90 స్థానాలు ఉన్న హర్యానాలో 89 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్)కు ఒక స్థానం కేటాయించింది.ఇదిలా ఉంటే.. హర్యానాలో అధికార బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. రాష్ట్రంలో పదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. రెండ పర్యాయాలు విజయం సాధించింది. అయితే ఈసారి బీజేపీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. నాలుగు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 10 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో ఐదు గెలిచాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా గెలుపుపై ధీమాగా ఉంది. అయితే బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ప్రస్తుతం ఆప్ కూడా పోటీలో ఉంది. దీంతో త్రిముఖ పోరులో తమకే లాభం కలుగుతుందని బీజేపీ భావిస్తోంది.ఇదిలా ఉంటే.. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 5న నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరఫున 1,561 మంది నామినేషన్లు వేశారు. స్వతంత్ర అభ్యర్థులతో కలిసి 1,747 మంది నామినేషన్లు వేశారు.
- Advertisement -