కాంగ్రెస్ ప్రభుత్వ కబంధ హస్తాల్లో కాపు నేతలు
మున్నూరు కాపులను ముంచేస్తున్న హస్తం పార్టీ
Kapu leaders in the clutches of the Congress government
తెలంగాణలో ఇప్పటికే జనాభా తగ్గించేసి ద్రోహం దానిపై పోరాటం చేద్దామంటే కుట్రలతో నిర్వీర్యం
మే 11న జరిగే మున్నూరు కాపుల గర్జనను అడ్డుకునే యత్నం
ఆ సామాజిక వర్గం సన్నాహక సభలను హైజాక్ చేస్తున్న వైనం
ప్రజాప్రతినిధులు వెళ్లకుండా సీఎం స్ధాయిలో సూచనలు
జల విహార్ సమావేశాన్ని నీరుగార్చింది ఈ ఆలోచనతోనే
అటు మొహం చాటేస్తున్న బీజేపీ ప్రజాప్రతినిధులు
కాస్తోకూస్తో మద్దతుగా నిలుస్తున్నది బీఆర్ఎస్ నాయకులే
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న మున్నూరు కాపులు
మే నెలలో సభ సక్సెస్ చేసి తీరతాం అంటున్న యువత
(వాయిస్ టుడే, హైదరాబాద్)
తెలంగాణలో అతిపెద్ద సామాజికవర్గం మున్నూరు కాపులు.. ఆ మాటకొస్తే ఉమ్మడ రాష్ట్రంలోనే కాపులు అతిపెద్ద కులం. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇది కొనసాగుతోంది. అయితే, రాజకీయాల్లో అందుకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదనేది మాత్రం వాస్తవం. మరీ ముఖ్యంగా తెలంగాణలో. ఒకప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అంటే.. పుంజాల శివశంకర్, కె.కేశవరావు, వి.హనుమంతరావు, డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్ ఇంకా అనేకమంది పెద్దపెద్ద నాయకులు.. మరిప్పుడు..? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అయితే, అందులోని మంత్రుల్లో మున్నూరు కాపులు ఎందరు..? అసలు ప్రభుత్వ పదవుల్లో మున్నూరు కాపులు ఎందరు? దీనికి సమాధానం జీరో అనే చెప్పాలి.
పదేళ్లలో జనాభా భారీగా తగ్గుతుందా? ఇక 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో తెలంగాణలో మున్నూరు కాపుల జనాభా 28 లక్షలు అని తేలింది. ఈ లెక్కన పదేళ్ల తర్వాత వారి సంఖ్య కనీసం 35 -40 లక్షలు అయి ఉండాలి కదా? కానీ, గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణనలో మున్నూరు కాపుల జనాభా 13 లక్షలుగా చూపారు. అంటే.. పదేళ్లలో జనాభా పెరగాల్సింది పోయి 15 లక్షలు తగ్గింది. ఇదేమి చోద్యం అని మున్నూరు కాపులే కాదు.. ఇతర కులాల వారూ ముక్కున వేలుసుకుంటున్నారు. పదేళ్లలో 15 లక్షల మందిని మాయం చేసేశారా? పదేళ్లలో ఏ కులం జనాభా అయినా కాస్తోకూస్తో పెరుగుతుంది. కానీ, మున్నూరు కాపులు మాత్రం 15 లక్షలు తగ్గిపోయారు. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఇంతకంటే దారుణం ఇంకోటి లేదేమో? ఏ కులానికీ ఇంత అన్యాయం జరగదేమో? కాంగ్రెస్ ప్రభుత్వాలకు దశాబ్దాల పాటు కొమ్ముకాసిన మున్నూరు కాపులకు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బహుమతి ఇది అన్నమాట. ఈ ఘోరాన్ని నిలదీసేందుకు మున్నూరు కాపులు సమాయత్తం అవుతున్నారు.
సభలపై సర్కారు కత్తి.. తమకు కుల గణనలో జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు సమయాత్తం అవుతున్న మున్నూరు కాపులపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కత్తి కత్తికట్టింది. వాస్తవానికి మే 11న ఆదివారం మున్నూరు కాపులు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికోసం సన్నాహక సభలు నిర్వహిస్తున్నారు. కానీ, వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం తన కుయుక్తులతో నిర్వీర్యం చేస్తోంది.
జల విహార్ సమావేశంపై నిఘా.. నీళ్లు.. మే 11న తలపెట్టిన భారీ బహిరంగ సభకు దిశానిర్దేశం చేసేందుకు ఆదివారం జల విహార్ లో మున్నూరు కాపు ప్రజాప్రతినిధుల సమావేశం తలపెట్టారు. దీనికి అధికార పార్టీ కాంగ్రెస్ కీలక ప్రజాప్రతినిధులు అందరూ డమ్మా కొట్టారు. కేవలం ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు మాత్రమే హాజరయ్యారు. ఆయన కూడా తాను కుల సంఘం సమావేశం అంటే రానని, కేవలం బీసీ సంఘం సమావేశాలకే ప్రాధాన్యం ఇస్తానంటూ తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సీఎం కార్యాలయం నుంచే.. జల విహార్ లో మున్నూరు కాపు ప్రజాప్రతినిధుల్లో మంత్రి కొండా సురేఖ, సీనియర్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ విప్ ఆది శ్రినివాస్ సహా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎవరూ హాజరుకాలేదు. వీరికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే నేరుగా సందేశాలు వెళ్లినట్లు సమాచారం. దశ దిశ లేకుండా చేశారు మే 11న తలపెట్టిన మున్నూరు కాపుల మహా గర్జనను లక్షలాది మందితో విజయవంతం చేసి.. తెలంగాణలో వారి సత్తా ఏమిటో చాటే బాధ్యత ఆ సామాజికవర్గం ప్రజాప్రతినిధులది. ఇందుకోసం తలో చేయి వేయాల్సింది పోయి వారే నీరుగార్చేలా చేశారు. ఆఖరుకు మున్నూరు కాపుల బహిరంగ సభకు దశ దిశ నిర్దేశించే సభకు కాంగ్రెస్ నాయకులు జెల్ల కొట్టిందే కాక..

సభకు దశదిశ లేకుండా చేశారు. కేవలం ప్రభుత్వం ప్రోద్బలంతోనే ఇలా చేశారనే విమర్శలు వస్తున్నాయి. కాగా, ఈ సభకు బీజేపీ నుంచి ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు ఎవరూ హాజరుకాలేదు. కులం కంటే మతానికే ప్రాధాన్యం ఇచ్చే పార్టీ కావడంతో ఆ పార్టీలోని మున్నూరు కాపు నాయకులంతా దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మాత్రం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ వంటి కీలక నాయకులు హాజరయ్యారు.
సత్తా చూపుతాం.. తెలంగాణలో ఇప్పటికే జనాభా తగ్గించేసి ద్రోహం చేసి తమను హస్తం పార్టీ ముంచేస్తున్నదని మున్నూరు కాపులు ఇప్పటికే మండిపడుతున్నారు. దానిపై పోరాటం చేద్దామంటే కుట్రలతో నిర్వీర్యం చేస్తున్న తీరును గమనిస్తున్నారు. తమ సామాజిక వర్గం సన్నాహక సభలను హైజాక్ చేస్తున్న వైనాన్ని పసిగట్టారు. అయితే, మే 11న జరిగే మున్నూరు కాపుల గర్జనను అడ్డుకునే యత్నాలను సహించేది లేదని తేల్చిచెబుతున్నారు. ప్రజాప్రతినిధులు వెళ్లకుండా సీఎం స్ధాయిలో సూచనలు చేసి జల విహార్ సమావేశాన్ని నీరుగార్చినా తాము మాత్రం మే 11న పరేడ్ మైదానంలో కదం తొక్కుతామని తేల్చిచెబుతున్నారు. అప్పటికైనా తమ సామాజికవర్గం సత్తా ఏమిటో తెలుస్తుందని పేర్కొంటున్నారు.