హైదరాబాద్, నవంబర్ 21, (వాయిస్ టుడే): కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పనితీరు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేసినప్పటి నుంచి దాన్ని ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల్లో నైతిక స్థైర్యం పెరిగింది. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అయిదు గ్యారంటీలను తాము అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే నెరవేర్చామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రచారం సాగిస్తున్నారు.కర్ణాటక సర్కారు అయిదు గ్యారంటీల అమలులో విఫలమైందని తెలంగాణలో ప్రత్యర్థి పక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే తాము ఇచ్చిన ఐదు గ్యారంటీలను అమలుచేయడంతోపాటు పలు విజయాలు సాధించామని సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫొటోలతో పత్రికల్లో ప్రకటనలను కాంగ్రెస్ సర్కారు జారీచేసింది.కర్ణాటకలోని బస్సుల్లో రోజుకు 60 లక్షలమంది మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, గృహలక్ష్మీ పథకం కింద 99.52 లక్షల మంది ఖాతాల్లో రెండువేల రూపాయల చొప్పున వేశామని కర్ణాటక సర్కారు ప్రకటించింది. అన్నభాగ్య స్కీం కింద 1.82కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం పంపిణీ చేశామని, యువనిధి పథకం కింద గ్యాడ్యుయేట్లకు నెలకు రూ.3వేలు, డిప్లొమా హోల్డర్లకు రూ.1500చొప్పున ఇస్తున్నామని కాంగ్రెస్ నేతలు తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే 96శాతం హామీలు అమలు చేశామని కాంగ్రెస్ తెలంగాణలో ప్రచారాస్త్రంగా వినియోగించుకుంటోంది. గృహ జ్యోతి పథకం కింద వినియోగదారులకు విద్యుత్ బిల్లులను మాఫీ చేశామని కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. కర్ణాటకలో చేసిన అభివృద్ధి పనుల చిట్టా, అమలు చేసిన ఎన్నికల హామీలపై కర్ణాటక సర్కారు పత్రికలకు ప్రకటనలు జారీ చేస్తోంది.కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ ప్రచారాన్ని తెలంగాణలోని బీఆర్ఎస్ నాయకులు తిప్పికొడుతూ కర్ణాటకలో రైతులకు 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయడం లేదని చెబుతున్నారు. కర్ణాటక రైతులతో ప్రకటనలు సైతం ఇప్పిస్తూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రచారానికి కౌంటర్ ఇస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి టానిక్ లాగా మారిందని ఓ రాజకీయ పరిశీలకుడు చెప్పారు.మరోవైపు కాంగ్రెస్ హామీలు కంటితుడుపుగా మారాయని కర్ణాటక జనతాదళ్ నేత కుమారస్వామి విమర్శలు గుప్పిస్తూ పరోక్షంగా బీఆర్ఎస్ కు మద్ధతు ఇస్తున్నారు. మొత్తంమీద కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో కర్ణాటక కాంగ్రెస్ సర్కారు పనితీరుపై ఫోకస్ పెరగడంతో ఓటర్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచారంలో ఎవరి మాట వింటారో, ఎలాంటి తీర్పు ఇస్తారనేది డిసెంబరు 3వతేదీ వరకు వేచిచూడాల్సిందే.