తిరుమల: కార్తీక వన భోజన కార్యక్రమం డిసెంబరు 3వ తేది ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలోని వైభవోత్సవ మండపంలో జరుగనుంది. సాదారణంగా గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో నిర్వహించడం ఆనవాయితీ. వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది వైభవోత్సవ మండపంలో నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా ఉదయం శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వైభవోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుండి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి వేంచేపు చేస్తారు.
ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మూెత్సవం, సహస్రదీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారు.