లిక్కర్ స్కాం కేసులో నిందితురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులపాటు పొడిగించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.
నేటితో ఆమె జ్యూడీషియల్ కస్టడీ ముగియగా.. తీహార్ జైలు నుంచి ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే కస్టడీ పొడిగించాలంటూ ఇటు ఈడీ, అటు సీబీఐ కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది.
మరోవైపు కస్టడీ పొడిగింపు అవసరం లేదని, ఈడీ కొత్తగా ఏ అంశాలను జత చేయలేదని కవిత తరఫు న్యాయవాది వాదించారు. అయితే.. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పురోగతిపైనా ప్రభావం ఉంటుందని ఈడీ తరఫు న్యాయవాది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. అయితే.. సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజునుంచి ఆరోపిస్తున్నారు, కొత్తగా ఏమీ చెప్పడం లేదంటూ కవిత తరపు న్యాయవాది రాణా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ కోర్టుకు అందజేసింది. అంతేకాదు 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జిషీట్ సమర్పిస్తామని ఈ సంద్భంగా ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో.. మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
కాసేపట్లో బెయిల్‌పై విచారణ
లిక్కర్ స్కాంలో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అక్రమంగా మార్చి 15వ తేదీన తనను అరెస్ట్ చేసిందని, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై కాసేపట్లో వాదనలు వినననున్నారు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా.
సోమవారం ఈ పిటిషన్‌పై వాదనలు జరగ్గా.. సాక్షాల ధ్వంసంపైనే ప్రధానంగా విచారణ కొనసాగడం విశేషం. డిజిటల్ ఫోన్లలో డేటాను ఆమె డిలీట్ చేశారని ఈడీ వాదించగా, అలాంటిదేం లేదని కవిత తరపు న్యాయవాది వాదించారు. కవిత ఇచ్చిన ఫోన్లలో ఎలాంటి డాటా దొరకలేని, ఫోన్లు ఫార్మాట్ చేయడం వల్లే డాటా లేదని, ఉద్దేశపూర్వకంగా ఆమె ఫోన్‌లు ఫార్మాట్ చేశారని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. అయితే తాము ఎలాంటి సాక్షాలను ధ్వంసం చేయలేదని కవిత తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. ఈడీకి ఇచ్చిన ఫోన్లలో.. పని మనుషులకు ఆమె ఇచ్చిన ఫోన్లు కూడా ఉన్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో కవిత తన ఫోన్లను స్వచ్ఛందంగా ఈడీకి ఇచ్చారని, కానీ, వాటిల్లో ఎలాంటి డాటా లేదని ఈడీ తరఫు న్యాయవాది, న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో డిజిటల్ సాక్ష్యాల ధ్వంసంపైనే న్యాయమూర్తి కావేరి బవేజా ప్రధానంగా ప్రశ్నలు స్పంధించడం గమనార్హం.
మరోవైపు లిక్కర్ కేసులో సీబీఐ ఏప్రిల్ 11వ తేదీన కవితను అరెస్ట్ చేసింది. ఈ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మే 2 వ తేదీ తీర్పు వెల్లడించన్నారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా.